CM Jagan: రైతులకు తోడూనీడగా నిలబడుతున్నాం: సీఎం జగన్‌

రైతులకు అన్ని విధాలుగా తోడు, నీడగా నిలబడుతున్నామని సీఎం జగన్ అన్నారు. ఏ సీజన్లో నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం

Updated : 15 Feb 2022 13:12 IST

అమరావతి: రైతులకు అన్ని విధాలుగా తోడు, నీడగా నిలబడుతున్నామని సీఎం జగన్ అన్నారు. ఏ సీజన్లో నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం జగన్‌ ఇవాళ ఇన్‌ఫుట్‌ సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మీట నొక్కి నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. అనంతరం జగన్‌ మీడియాతో మాట్లాడారు.

‘‘2021 నవంబర్‌లో వర్షాలు, వరదలకు రైతులు పంట నష్టపోయారు. ఆ రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద సాయం అందిస్తున్నాం. నేల కోత, ఇసుక మేటల కారణంగా నష్టం ఏర్పడింది. 5,79,311 మంది రైతులకు రూ.542కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నాం. 1,220 రైతు గ్రూపులకు యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్ల లబ్ధి చేకూరుతుంది. మొత్తంగా ఇవాళ రూ.571కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. గత ఖరీఫ్‌లో రూ.1800కోట్లు బీమా కింద ఇచ్చాం. వివిధ కారణాలతో రూ.93కోట్లు ఇవ్వలేకపోయాం. సాంకేతిక సమస్యలు పరిష్కరించి ఇవాళ రూ.93కోట్లు ఇస్తున్నాం.

రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి పంట అమ్మకం వరకు గొప్ప కార్యక్రమం జరుగుతోంది. యంత్రసేవా పథకం ద్వారా రైతులను ప్రోత్సహిస్తున్నాం. వైఎస్సాఆర్‌ రైతు భరోసా, రైతులకు సున్నా వడ్డీ పథకాల ద్వారా రెండున్నరేళ్ల కాలంలో రైతన్నకు అండగా నిలిచాం. గత ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ సరిగా ఇవ్వలేదు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. రాయలసీమలోనూ గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి’’ అని సీఎం జగన్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని