CM Jagan: ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 754 చికిత్స విధానాలు: సీఎం జగన్‌

ఆరోగ్యశ్రీ కింద ప్రస్తుతం ఉన్న చికిత్స విధానాలను గణనీయంగా పెంచాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులు ఆదేశించారు.

Updated : 17 Aug 2022 20:24 IST

అమరావతి: ఆరోగ్యశ్రీ కింద ప్రస్తుతం ఉన్న చికిత్స విధానాలను గణనీయంగా పెంచాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులు ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 754 ప్రొసీజర్లు పెంచుతున్నట్లు సీఎం తెలిపారు. వీటితో కలిపి ఆరోగ్యశ్రీ కింద అందుతోన్న చికిత్స విధానాల సంఖ్య 3118కి చేరిందని చెప్పారు. కొత్త విధానాలు సెప్టెంబర్‌ 5 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్షించారు. 

వైద్యారోగ్యశాఖలో కీలక సంస్కరణలు..

పార్వతీపురం మన్యం జిల్లాలోనూ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్యశాఖలో మరికొన్ని కీలక సంస్కరణలకు సీఎం పచ్చజెండా ఊపారు. జిల్లాలో ఉండే ప్రభుత్వ ఆస్పత్రులు, సీహెచ్‌సీ, పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్‌లు అన్నీ సంబంధిత జిల్లాలోని మెడికల్‌ కాలేజీ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. వైద్య, పరిపాలనా కార్యకలాపాలు మెడికల్‌ కాలేజీ పరిధిలోకి రానుండగా.. పకడ్బందీగా వైద్య సేవలు అందించడం సహా సిబ్బంది మధ్య సమన్వయానికే ఈ చర్యలు తీసుకున్నట్లు సీఎం తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలన్న సీఎం.. ఇకపై కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లుగా మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు అందుబాటులో ఉంటారని సీఎం స్పష్టం చేశారు.

విలేజ్‌ క్లినిక్‌లో నలుగురు సిబ్బంది..

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌కు అవసరమైన కసరత్తు పూర్తి చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పీహెచ్‌సీలు-మొబైల్‌ మెడికల్‌ యూనిట్లు (ఎంఎంయూ)ల మ్యాపింగ్‌ పూర్తయిందన్నారు. పీహెచ్‌సీలు-సచివాలయాల మ్యాపింగ్‌ పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటికే 656 ఎంఎంయూలు పనిచేస్తున్నాయని.. మరో 432 ఎంఎంయూలు సమకూరుస్తున్నామని తెలిపారు. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రతి విలేజ్‌ క్లినిక్‌లో ముగ్గురు నుంచి నలుగురు సిబ్బంది ఉంటారన్న సీఎం.. మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌, ఒక ఏఎన్‌ఎం, ఒకరు లేదా ఇద్దరు ఆశావర్కర్లు ఉంటారని వివరించారు. విలేజ్‌ క్లినిక్స్‌లో 67 రకాల మందులు, 14 రకాల పరీక్షలు అందుబాటులో ఉంటాయన్నారు. 6956 టెలీమెడిసిన్‌ స్పోక్స్‌, 27 హబ్స్‌ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మెడికల్‌ హబ్స్‌ను అన్ని జిల్లాల వైద్యకళాశాలల్లో ఏర్పాటుచేయాలని నిర్దేశించారు. జిల్లా వైద్య కళాశాల నేతృత్వంలోనే ఇవి పనిచేయాలని, ఈ మెడికల్‌ హబ్స్‌ నుంచి చికిత్సలకు అవసరమైన సలహాలు, సూచనలు వైద్యులకు వెళ్లాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని