CM Jagan: పట్టణాల్లో సమస్యల పరిష్కారానికి కొత్త యాప్‌

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో సమస్యల గుర్తింపు, పరిష్కారం, నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక యాప్ త్వరలో అందుబాటులోకి రానుంది. పర్యవేక్షణ సహా సమస్యలపై సత్వర పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్‌ అదేశించారు. 

Published : 25 Nov 2022 19:46 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో సమస్యల గుర్తింపు.. పరిష్కారం.. నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక యాప్ త్వరలో అందుబాటులోకి రానుంది. పర్యవేక్షణ సహా సమస్యలపై సత్వర పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్‌ అదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్‌ సర్వీసుల కోసం నగరాలు, పట్టణాలు సహా గ్రామాల్లోనూ యాప్‌ను తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఏపీ కన్‌సిస్టెంట్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ మున్సిపల్‌ సర్వీసెస్ (ఏపీ సీఎం ఎంఎస్) పేరిట రానున్న యాప్‌లో క్షేత్రస్థాయిలో సిబ్బంది గుర్తించిన సమస్యల ఫొటోలను అప్‌లోడ్‌ చేసే అవకాశం కల్పించనున్నారు. సమస్యను ఫొటో తీసి యాప్‌లో పొందుపరిస్తే వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకునేలా రూపొందిస్తున్నారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా తమ దృష్టికి వచ్చిన అంశాలను యాప్‌ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. యాప్‌ను వీలైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని పురపాలక శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

‘‘మున్సిపల్‌ సర్వీసులపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా యాప్ తయారు చేస్తున్నాం. మరో నెలరోజుల్లో యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తాం. రోడ్లపై గుంతలు, రోడ్లకు మరమ్మతులు, పచ్చదనం, సుందరీకరణ, వీధిలైట్ల నిర్వహణ, పుట్‌పాత్స్, మురుగు కాల్వల్లో పూడిక తొలగింపు, భూగర్భ మురుగునీటి వ్యవస్థల నిర్వహణ, పబ్లిక్‌ టాయ్‌లెట్ల ఏర్పాటు, వాటి నిర్వహణ, ట్రాఫిక్‌ జంక్షన్ల నిర్వహణ.. తదితర అంశాలపై యాప్‌ ద్వారా రియల్‌ టైం మానిటరింగ్ చేయొచ్చు. యాప్‌ ద్వారా రాష్ట్రంలోని 4,119 వార్డు సచివాలయాల పరిధిలో మౌలిక సదుపాయాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. నివేదించిన ప్రతి సమస్యకు పరిష్కారంపైనా పర్యవేక్షణ ఉంటుంది’’ అని అధికారులు సీఎంకు వివరించారు.

రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ..

ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్‌ పలు ఆదేశాలు జారీ చేశారు. ‘‘నగరాలు, పట్టణాల్లో రోడ్లు, మురుగునీటి కాల్వలు సహా ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలి. ఇప్పుడు తీసుకురానున్న యాప్‌ ద్వారా వచ్చే గ్రీవెన్స్‌ను పరిష్కరించే వ్యవస్థ బలోపేతంగా ఉండాలి. వర్షాకాలం సహా అన్ని కాలాల్లోనూ బాగుండేలా రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ అంశంపైనా దృష్టి పెట్టాలి. దీర్ఘకాలం ఉండే విధంగా రోడ్ల నిర్మాణం సాగాలి. మున్సిపల్‌ సర్వీసులు పారదర్శకంగా ప్రజలకు అందాలి. ప్రజలకు సత్వర సేవలు అందేలా సమయంలోగా అనుమతులు రావడం, అవినీతి లేకుండా చూడటమే లక్ష్యంగా మార్పులు తీసుకురావాలి’’ అని అధికారులను సీఎం ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని