థర్డ్‌వేవ్‌ను సమర్థంగా ఎదుర్కోవాలి: జగన్

కొవిడ్ మూడో వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ తో సహజీవనం

Updated : 06 Jul 2021 21:09 IST

అమరావతి: కొవిడ్ మూడో వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ తో సహజీవనం చేస్తూనే జాగ్రత్తలు పాటించాలన్నారు. జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్పందన కార్యక్రమంపై సమీక్షించారు. కొవిడ్ నియంత్రణ కోసం అహర్నిశలూ శ్రమించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది సహా ఉద్యోగులను సీఎం అభినందించారు. కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణలో ఏపీ మెరుగైన స్థానంలో ఉందని పేర్కొన్నారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకూ యంత్రాగం అప్రమత్తంగా ఉండాలని.. వ్యాక్సిన్ రెండో డోసుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. 45 ఏళ్లు పైబడిన వారిలో 90 శాతం మేర వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలినవారిపై దృష్టి పెట్టాలన్నారు. ఆర్థిక లావాదేవీలు కొనసాగేలా జిల్లాల్లో కర్ఫ్యూను సడలించామని స్పష్టం చేశారు.

జులైలో రైతు చైతన్య యాత్రలు..

‘‘వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ అంశాలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి. జూలై 9 నుంచి 23 వరకు రైతు చైతన్య యాత్రలు చేపట్టాలి. ఈ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 94.84 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే ఇప్పటివరకు 4.98 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేశారు. ఇ-క్రాపింగ్‌పై దృష్టి సారించాలి. పెట్టుబడి రాయితీ, బీమా, పంట కొనుగోళ్లు, రుణాలు, సున్నా వడ్డీ పథకం అమలు.. ఇలా అన్నింటినీ ఇ-క్రాపింగ్‌ ద్వారా పర్యవేక్షించే అవకాశం ఉంది. రైతు భరోసా యూనిఫైడ్‌ డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ యాప్‌ను కూడా తీసుకు వస్తున్నాం. రైతు సాగు చేసిన భూమికి ఎలాంటి పత్రాల్లేకపోయినా ఇ-క్రాప్‌లో నమోదు చేయాలి.

వారంలో రెండు సార్లు సందర్శిస్తా..

జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు కలెక్టర్లు, ఎస్పీలు రెండు వారాలకు ఒకసారి సమావేశం కావాలి. రైతులకు విక్రయించే విత్తనాల నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఏడాది డిసెంబర్‌ 31 నాటికి 4,024 గ్రామాలకు ఫైబర్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేస్తాం. అప్పట్లోగా ఆయా పంచాయతీల్లో డిజిటల్‌ గ్రంథాలయాలు సిద్ధం కావాలి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మరో 200 సేవలను అదనంగా ప్రజలకు అందించబోతున్నాం. దీంతో మొత్తంగా 740 పౌర సేవలు సచివాలయాల ద్వారా అందుతాయి. కొవిడ్‌ తగ్గుముఖం పడితే ఎమ్మెల్యేలతో కలిసి వారానికి రెండు సార్లు నేను కూడా సచివాలయాలను సందర్శిస్తాను’’ అని సీఎం వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు