CM Jagan: మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీఎం జగన్‌

మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 61 సీడీపీఓ పోస్టుల భర్తీకీ సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Updated : 15 Dec 2022 19:33 IST

అమరావతి: మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) అధికారులను ఆదేశించారు. ఆ శాఖలో ఖాళీగా ఉన్న 61 సీడీపీఓ (CDPO-Child Development Project Officer) పోస్టులను ఏపీపీఎస్సీ (APPSC) ద్వారా భర్తీ చేయాలని సూచించారు. అంగన్‌వాడీలలో సార్టెక్స్‌ రైస్‌ సరఫరా చేయాలని.. న్యూట్రిషన్‌ కిట్‌ సరఫరాలో నాణ్యత విషయంలో అసలు రాజీ పడొద్దన్నారు. అంగన్‌వాడీల నుంచే పిల్లలకు భాషపై గట్టి పునాది వేయాలని ఆదేశించారు. పిల్లలకు ఉత్తమ అభ్యాసాలు ఉండాలని సీఎం సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై  సీఎం జగన్‌ ఇవాళ ఉన్నతాధికారులతో సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. అంగన్‌వాడీల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ‘‘నాడు-నేడు కింద చేపడుతున్న పనులను వేగవంతం చేయాలి. సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. అంగన్‌వాడీలలో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు, వారికి మంచి వాతావరణాన్ని కల్పించడం ముఖ్యం. అంగన్‌వాడీల్లో సార్టెక్స్‌ రైస్‌ సరఫరా చేయాలి. న్యూట్రిషన్‌ కిట్‌ సరఫరాలో నాణ్యత విషయంలో అసలు రాజీ పడొద్దు. పిల్లలకు ఇచ్చే న్యూట్రిషన్‌ కిట్‌ నాణ్యత కచ్చితంగా అత్యున్నత ప్రమాణాలతో ఉండాలి. అంగన్‌వాడీలలో పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలలో అన్నింటా క్వాలిటీ పెరగాలి. అంగన్‌వాడీల్లో  బోధనాంశం కూడా మారాలి. ఎందుకంటే పిల్లలకు చిన్న వయసులోనే మెదడు తొందరగా పరిణతి చెందుతుంది. ఏ విషయాన్ని అయినా త్వరగా గ్రహించగలుగుతారు. ఇంకా వారికి మంచి అవగాహన కూడా ఏర్పడుతుంది. పాఠ్యప్రణాళిక మార్పు కోసం అవసరమైతే ప్రత్యేక అధికారిని నియమించాలి’’ అని జగన్‌ అధికారులను ఆదేశించారు. 

కొత్తగా అందుబాటులోకి వచ్చిన సూపర్‌వైజర్ల సహాయంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. తనిఖీలు, నాణ్యత, నాడు-నేడు ఈ మూడు అంశాలకు సంబంధించి కచ్చితమైన మార్పు కనిపించాలన్నారు. అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, హౌసింగ్, మహిళా శిశు సంక్షేమ శాఖలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సిబ్బంది నియామకాలు సహా.. ఏ రకమైన అవసరం ఉన్నా ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఆ మేరకు కచ్చితమైన ఫలితాలు కూడా రావాల్సి ఉందన్నారు. సూపర్‌వైజర్స్‌ సక్రమంగా పని చేయాలని.. వీరి పనితీరుపైనా పర్యవేక్షణ ఉండాలని సీఎం జగన్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని