Andhra news: భారతీయులకు క్రమశిక్షణ నేర్పే పుస్తకమే రాజ్యాంగం: సీఎం జగన్‌

భారతీయులకు క్రమశిక్షణ నేర్పే నిబంధనల పుస్తకమే రాజ్యాంగమని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Updated : 26 Nov 2022 19:35 IST

విజయవాడ: వేర్వేరు భాషలు, కులాలు, ప్రాంతాలు కలిగిన భారతదేశానికి క్రమశిక్షణ నేర్పే నిబంధనల పుస్తకమే రాజ్యాంగమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. సంఘ సంస్కరణల చరిత్రలో దీనికి ఎంతో ప్రాధాన్యముందని చెప్పారు. రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో కలిసి జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా భారతదేశంలో మార్పులు చోటు చేసుకునేందుకు వీలుగా రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు అంబేడ్కర్‌ అని కొనియాడారు. 72 ఏళ్లుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాగతులను, భావజాలాలను రాజ్యాంగం మారుస్తూనే ఉందని చెప్పారు. రాజ్యాంగమే మన సంఘసంస్కర్త అని సీఎం జగన్‌ అన్నారు.

వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విజయవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని సీఎం జగన్‌ వెల్లడించారు. రాష్ట్రంలో గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాధించామన్నారు. పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేసి, విద్యార్థలుకు సీబీఎస్ఈ పాఠ్యాంశాలను నేర్పిస్తున్నామని తెలిపారు. రాజధాని కోసం సేకరించిన భూములను పేదలకు ఇస్తే సామాజిక సంతులన దెబ్బతింటుందన్న వాదనలను రాజ్యాంగ రూపకర్తలు ఊహించి ఉండకపోవచ్చని జగన్‌ అభిప్రాయపడ్డారు. దానిపైనా ప్రభుత్వం పోరాడుతోందని చెప్పారు. మహిళల ఆర్థిక సామాజిక అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌), నాన్ డీబీటీ ద్వారా రూ.3.80 లక్షల కోట్లు ప్రజలకు అందించామని సీఎం వివరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారికి రాజకీయ పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

అనంతరం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ మాట్లాడుతూ.. రాజ్యాంగ రూపకర్తల కృషిని దేశప్రజలెవరూ విస్మరించరాదని అన్నారు.  ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల వేళ  మన ప్రజాస్వామ్యం ప్రపంచానికి దిక్సూచిగా మారిందన్నారు. సామాన్యుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సమాన హక్కులు పొందేలా మన రాజ్యాంగం అమలవుతోందని ఆయన తెలిపారు. పౌరులందరికీ జీవించే హక్కు..వాక్‌ స్వాతంత్య్రం లాంటి అంశాలకు రాజ్యాంగం పెద్దపీట వేసిందని గవర్నర్‌ కొనియాడారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని