Updated : 11 Jan 2022 15:48 IST

CM Jagan: వివాదాలు లేని ప్లాట్లను తక్కువ ధరకే అందిస్తాం: సీఎం జగన్‌

అమరావతి:  వివాదాలు లేని ప్లాట్లను మార్కెట్‌ ధర కంటే తక్కువకే మధ్యతరగతి ప్రజలకు అందిస్తామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మోసాలు చేయకుండా ఉండేలా లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం ఎంఐజీ లేఅవుట్లు వేస్తోందని చెప్పారు. ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌’ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి పేదవాడికీ ఇల్లుండాలన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 31లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని చెప్పారు. మొదటి దశలో 15.60లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై పనులు జరుగుతున్నాయన్నారు. 

రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గానికీ..

మధ్యతరగతి వారికి సొంతింటి కలను సాకారం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. దీనిలో భాగంగానే ప్రభుత్వం ఎంఐజీ లేఅవుట్లు వేస్తోందని జగన్‌ చెప్పారు. ఎంఐజీల్లో అన్ని సౌకర్యాలతో ప్లాట్లు అందించేలా ఇవాళ్టి నుంచి శ్రీకారం చుడుతున్నామన్నారు. మూడు కేటగిరీల్లో స్థలాలు పంపిణీ చేస్తామని.. ఎంఐజీ-1లో 150 గజాలు, ఎంఐజీ-2లో 200 గజాలు, ఎంఐజీ-3 కింద 240 గజాలు అందిస్తామని సీఎం వివరించారు. తొలిదశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని నవులూరు, కడప జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లేఅవుట్లలో అమలు చేస్తామన్నారు. నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి ఈ పథకాన్ని విస్తరిస్తామని.. ఆయా ప్రాంతాల ప్రజలు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని జగన్‌ వివరించారు. 

4 విడతల్లో డబ్బు చెల్లించుకునే అవకాశం..

రూ.18లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారు ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం తెలిపారు. ఏడాదిలో 4 విడతల్లో ప్లాట్‌ కోసం డబ్బు చెల్లించే అవకాశముంటుందన్నారు. దరఖాస్తు సమయంలో 10శాతం, నెలలోపు 30 శాతం, ఆరు నెలల్లోపు మరో 30 శాతం, రిజిస్ట్రేషన్‌లోపు మిగిలిన 30 శాతం చెల్లించవచ్చన్నారు. చెల్లింపులు పూర్తయిన వెంటనే అభివృద్ధి చేసిన ప్లాటును లబ్ధిదారునికి అందజేస్తామని చెప్పారు. ముందుగానే పూర్తి మొత్తం చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంఐజీలో 10 శాతం ప్లాట్లు 20 శాతం రిబేటుతో కేటాయిస్తామని చెప్పారు. ఈ పథకంలో నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ ఆదర్శప్రాయంగా ఉండేలా ప్లాట్లను అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. పూర్తి పారదర్శకతతో ఆన్‌లైన్‌ ద్వారానే ఎంఐజీల్లో ప్లాట్లు కేటాయిస్తామన్నారు.
 


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని