Updated : 09 Mar 2021 00:46 IST

స్వాంతంత్ర్య ఉత్సవాలకు రూ.25 కోట్లు : కేసీఆర్

హైదరాబాద్‌: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌’ మహోత్సవ్‌’ పేరిట కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జరపనున్న ఉత్సవాలను రాష్ట్రంలో ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇందుకోసం రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవాల’ నిర్వహణపై ప్రధాని మోదీ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉత్సవాల నిర్వహణపై సీఎం అధికారులకు దిశానిర్ధేశం చేశారు. భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో తెలంగాణ పోషించిన పాత్ర ప్రత్యేకమైందని సీఎం అన్నారు. స్వయం పాలనలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణది దేశ అభ్యుదయంలో ఉజ్వలమైన భాగస్వామ్యమని చెప్పారు. 

ఈ నెల 12 నుంచి 2022 ఆగస్టు 15వ వరకు 75 వారాల పాటు నిర్వహించనున్న మహోత్సవాలకు 25 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారిని నియమించారు. సాధారణ పరిపాలన, ఆర్థిక, సాంస్కృతిక, పురపాలక, పంచాయతీరాజ్, విద్యాశాఖల కార్యదర్శులు, పురపాలకశాఖ సంచాలకులు, పంచాయతీరాజ్ కమిషనర్ సభ్యులుగా, సాంస్కృతిక శాఖ సంచాలకులు సభ్యకార్యదర్శిగా ఉంటారు. ఈ మేరకు కమిటీ ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. 

75 వారాల నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్, వరంగల్ పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, వరంగల్‌లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథులుగా పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో జాతీయ పతాకావిష్కరణ, పోలీస్ మార్చ్, గాలిలో బెలూన్లు వదలడం, దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమాలు జరపాలని సీఎం కేసీఆర్ సూచించారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవా’లను ఘనంగా, పండుగ వాతావరణంలో నిర్వహించాలని సీఎం సూచించారు. స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరులను స్మరించుకుని జోహార్లు అర్పించాలని తెలిపారు. ఉత్సవాలకు గుర్తుగా సంజీవయ్య పార్క్ తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 75 ముఖ్యమైన ప్రాంతాల్లో ఘనమైన రీతిలో జాతీయ జెండాలను ఎగురవేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా జాతీయ భావాలను మరింతగా పెంపొందించాలని సూచించారు. 75 వారాల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా వివిధ స్థాయిల్లో వ్యాస రచన, ఉపన్యాస, చిత్రలేఖన పోటీలు, కవి సమ్మేళనాలు, తదితర దేశభక్తిని పెంచే కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ చెప్పారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని