Cm Kcr: రాష్ట్రాల్లో పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయి: సీఎం కేసీఆర్‌

తెలంగాణలో తడిసిన వరి ధాన్యాన్ని కూడా కొంటామని... ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పల్లె, పట్టణ ప్రగతి, ధాన్యం సేకరణపై మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా...

Published : 18 May 2022 15:27 IST

హైదరాబాద్: తెలంగాణలో తడిసిన వరి ధాన్యాన్ని కూడా కొంటామని... ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పల్లె, పట్టణ ప్రగతి, ధాన్యం సేకరణపై మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వరి ధాన్యం సేకరణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణా, మిల్లుల్లో దిగుమతి, ధాన్యం సేకరణ ప్రక్రియపై ఆరా తీశారు. మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఇప్పటివరకు 20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుంది..

వర్షాకాలం సమీపిస్తుండడంతో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అకాల వర్షాల కారణంగా అక్కడక్కడ వరిధాన్యం తడుస్తున్న నేపథ్యంలో ధాన్యం తడవకుండా సరైన చర్యలు తీసుకోవాలన్నారు. తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. ఎంత ఖర్చు అయినా రాష్ట్ర ప్రభుత్వమే భరించి చివరి గింజ వరకు కొంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కొన్నా కొనకున్నా బాయిల్డ్ రైస్‌ను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్‌ మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 24 వేల ‘గ్రామీణ క్రీడా కమిటీ’లను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో క్రీడలు నిర్వహించేందుకు కమిటీలు పనిచేస్తాయని.. జూన్ 2న కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.

జూన్‌ 3 నుంచి పల్లె, పట్టణ ప్రగతి..

వేసవి తీవ్రత దృష్ట్యా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను కొద్దిరోజుల పాటు వాయిదా వేయాలని సమావేశంలో సభ్యులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈనెల 20 నుంచి నిర్వహించాల్సిన ఆ కార్యక్రమాలను జూన్‌ 3 నుంచి 15 రోజుల పాటు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో ‘‘ఉమ్మడి పాలనలో తెలంగాణ చాలా ధ్వంసమైంది. విధ్వంసం అనంతరం వ్యవస్థలను పునర్‌ నిర్మించడం చాలా కష్టం. ధ్వంసమైన తెలంగాణను బాగుచేసేందుకు కష్టపడాల్సి వస్తోంది. నేడు దేశం గర్వించే స్థాయిలో పల్లె, పట్టణాల అభివృద్ధి చేస్తున్నాం. పల్లె, పట్టణ ప్రగతికి దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం హర్షణీయం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో తొలిసారి 10 గ్రామాలు ఎంపికయ్యాయి. రెండో సారి ప్రకటించిన జాబితాలో మొదటి 20 స్థానాల్లో తెలంగాణ నుంచే 19 గ్రామాలు ఉండడం గొప్ప విషయం. ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించి ప్రగతి సాధిస్తున్నాం. ప్రభుత్వం చేపట్టిన చర్యలు నేడు గ్రామాల్లో స్ఫూర్తిని నింపాయి. రాష్ట్రాల్లో పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయి. కూలీల డబ్బులు కేంద్రమే దిల్లీ నుంచి పంచాలనుకోవడం సరికాదు. తాగు, సాగు నీరు లేక ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. విద్య, వైద్యం, అనేక రంగాల్లో రావాల్సిన ప్రగతి రాలేదు. దేశం గర్వించే విధంగా మిషన్‌ భగీరథ ద్వారా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకున్నాం. అనతికాలంలోనే అభివృద్ధిని సాధించగలిగాం. భాగస్వామ్యులైన ప్రజాప్రతినిధులు, అధికారులకు అభినందనలు’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని