
‘ప్రపంచ దేవాలయాల్లో యాదాద్రి ప్రత్యేకమైనది’
ఆలయ అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష
హైదరాబాద్: పూర్తిగా కృష్ణశిలలతో నిర్మితమవుతోన్న యాదాద్రి పుణ్యక్షేత్రం అద్భుత రూపంతో ప్రపంచ దేవాలయాల్లోనే ప్రత్యేకతను చాటి చెప్పబోతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని పునః ప్రారంభించేందుకు తుదిమెరుగులు దిద్దే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎటునుంచి చూసినా దేవాలయం సర్వాంగసుందరంగా కనిపించేలా తీర్చిదిద్దాలన్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులు, ఆర్కిటెక్ట్‌లతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించిన సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు.
క్యూలైన్ నిర్మాణంలో చేపట్టాల్సిన అలంకరణ విషయమై అధికారులకు సీఎం సూచనలు చేశారు. 350 ఫీట్ల పొడవైన క్యూలైన్ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలన్నారు. క్యూలైన్ పొడవునా ప్రాకారం మీద బిగించే కలశపు నమూనాలను పరిశీలించిన ఆయన.. నాలుగింటిలో ఒకదాన్ని ఖరారు చేశారు. ఉత్తర దిక్కున ఉన్న ప్రహరీని తొలగించి అక్కడ క్యూలైన్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. క్యూలైన్ల నిర్మాణాన్ని వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని గడువు విధించారు. దీప స్తంభం, ప్రహరీని ఇత్తడితో సృజనాత్మకంగా తీర్చిదిద్దాలని చెప్పారు. ఉత్తర దిక్కు ప్రాకారాన్ని తొలగించి కోవెల కనిపించేలా గ్రిల్స్, రెయిలింగ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఇతర కట్టడాలు అడ్డులేకుండా, దేవాలయం చుట్టూ 360 డిగ్రీలు తిరిగి చూసినా సుందరంగా కనిపించేలా తుదిమెరుగులు దిద్దాలని సూచించారు. బ్రహ్మోత్సవాల్లో సుదర్శన చక్రం ఏర్పాటు చేసిన తరహాలోనే శివాలయం చుట్టూ త్రిశూలం కనిపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
అద్దాల మండపం అత్యంత సుందరంగా నిర్మితమవుతోందని సీఎం కొనియాడారు. రాత్రి వేళల్లో ఆలయ సముదాయం, ప్రాంగణాల చుట్టూ, పరిసరాలు దివ్యమైన వెలుగులతో ప్రకాశించేలా రూపొందించిన లైటింగ్ డెమో వీడియోను ముఖ్యమంత్రి తిలకించారు. పునర్నిర్మాణం తర్వాత ప్రపంచ దేవాలయాల్లోనే యాదాద్రి పుణ్యక్షేత్రం తన ప్రత్యేకతను చాటుకుంటుందని అన్నారు. పునః ప్రారంభం తర్వాత లక్ష్మీనారసింహుని దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గుట్ట పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.