CM KCR: హైదరాబాద్‌ దాహార్తిని తీర్చే మహత్తర ప్రాజెక్టు ‘మల్లన్నసాగర్‌’: కేసీఆర్‌

మల్లన్నసాగర్‌ను ప్రారంభించుకోవడం చారిత్రక ఘట్టమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. క ఈ మహాయజ్ఞంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు

Updated : 23 Feb 2022 17:14 IST

తొగుట: మల్లన్నసాగర్‌ను ప్రారంభించుకోవడం చారిత్రక ఘట్టమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ మహాయజ్ఞంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్‌ వద్ద నిర్మించిన మల్లన్నసాగర్‌ జలాశయాన్ని సీఎం కేసీఆర్‌ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో సీఎం మాట్లాడారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో 58వేలకు పైగా కార్మికులు పాల్గొన్నారని కేసీఆర్‌ తెలిపారు. ఇది మల్లన్నసాగర్‌ కాదని.. తెలంగాణ జనహృదయసాగరమని.. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరమని చెప్పారు. ఒక్క సిద్దిపేట జిల్లాకే కాకుండా హైదరాబాద్‌ నగరానికి శాశ్వతంగా మంచినీటి సమస్యను దూరం చేసే గొప్ప ప్రాజెక్టు ఇది అని.. మహానగరానికి దాహార్తిని తీర్చే మహత్తరమైన జల భాండాగారమన్నారు.

ముంపు గ్రామాల ప్రజల త్యాగం వెలకట్టలేనిది

‘‘గోదావరి నీళ్లు తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాభిషేకం చేస్తామని ఆనాడు చెప్పాం. ఈరోజు కలశాల్లో గోదావరి జలాలను తీసుకెళ్లి అభిషేకం చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మంత్రి హరీశ్‌రావు పాత్ర ఎనలేనిది. గతంలో నీటిపారుదలశాఖ మంత్రిగా ఆయన ఎంతో కృషి చేశారు. మల్లన్నసాగర్‌లో కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ముంపు గ్రామాల ప్రజల త్యాగం వెలకట్టలేనిది. పరిహారం అందని వారు ఎవరైనా ఉంటే వారికి అందేలా చూస్తాం.

అద్భుత గ్రామీణ తెలంగాణ సాకారమవుతోంది..

పాలమూరు జిల్లాలోనూ మల్లన్నసాగర్‌ వంటి ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు త్వరలోనే పూర్తవుతుంది. తెలంగాణకు కరవు రాకుండా చేసే ప్రాజెక్టు కాళేశ్వరం. దేశమంతా కరవు వచ్చినా.. తెలంగాణకు రాదు.  ప్రాజెక్టులపై అవగాహన లేనివాళ్లే చిల్లర ప్రయత్నాలు చేస్తారు. విమర్శకుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చిన్నచిన్న లోపాలుంటే ఇంజినీర్లు సరిచేస్తారు. పంజాబ్‌తో పోటీపడుతూ తెలంగాణలో ధాన్యం పండిస్తున్నాం. ఐటీ ఉద్యోగం చేసేవారు కూడా నేడు వ్యవసాయం చేస్తున్నారు. అద్భుత గ్రామీణ తెలంగాణ సాకారమవుతోంది. పాడి పరిశ్రమ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతోంది’’ అని కేసీఆర్‌ అన్నారు.

చివరి రక్తం బొట్టు ధారపోసైనా..

‘‘దేశం దారి తప్పి పోతుంది. దేశంలో జుగుప్సాకర పరిస్థితులు నెలకొన్నాయి. గత ప్రభుత్వాల కృషి వల్ల బెంగళూరు సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా మారింది. తెలంగాణకు అద్భుతమైన పరిశ్రమలు వస్తున్నాయి. దేశంలో అతి తక్కువ నిరుద్యోగులున్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రాలు బాగుండాలంటే.. కేంద్రం బాగుండాలి. మత కల్లోలాలు, గొడవలు ఉంటే రాష్ట్రాలకు, దేశానికి పరిశ్రమలు రావు. అలాంటి పరిస్థితులు రానివ్వొద్దు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేలా ముందుకు వెళ్తున్నాం. కులాలు, మతాల పేరిట చిచ్చుపెట్టడం మంచిది కాదు. కేంద్రంలో ధర్మంతో పనిచేసే ప్రభుత్వం ఉండాలి. చివరి రక్తం బొట్టు ధారపోసైనా దేశాన్ని సరైన మార్గంలో పెడతాను. దేశాన్ని సన్మార్గంలో పెట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతాను. సకల మేథో సంపత్తులు ఉపయోగిస్తాను’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని