CM KCR: జస్టిస్‌ ఎన్‌.వి. రమణ చొరవతోనే ఆ సమస్యకు పరిష్కారం: సీఎం కేసీఆర్‌

ఎనిమిదేళ్ల క్రితం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం అందరి సహకారం, సమన్వయంతో ముందుకు పురోగమిస్తోందని సీఎం కేసీఆర్‌

Updated : 15 Apr 2022 13:33 IST

హైదరాబాద్‌: ఎనిమిదేళ్ల క్రితం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం అందరి సహకారం, సమన్వయంతో ముందుకు పురోగమిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో పటిష్ట ఆర్థిక పురోగతి సాధిస్తున్నామని.. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లోనూ ముందుకెళ్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయాధికారుల సదస్సులో కేసీఆర్‌ మాట్లాడారు. రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు ఏర్పాటు చేశామని.. అన్ని జిల్లాల్లోనూ సమీకృత కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. రాష్ట్ర న్యాయవ్యవస్థ, పరిపాలనా విభాగం కూడా గొప్పగా ముందుకెళ్లాలని ప్రబలంగా ఆకాంక్షిస్తున్నట్లు కేసీఆర్‌ చెప్పారు. 

హైకోర్టు విడిపోయిన తర్వాత బెంచీల సంఖ్య పెంపుపై కేంద్రానికి, ప్రధాని మోదీకి లేఖరాశానని కేసీఆర్‌ గుర్తుచేశారు. అయితే ఆ అంశం పెండింగ్‌లో ఉండేదని.. సీజేఐగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ బాధ్యతలు చేపట్టాక ఆ సమస్య పరిష్కారమైందని చెప్పారు. హైదరాబాద్‌పై ఆయనకున్న అవ్యాజమైన ప్రేమ, అనురాగాలకు సంకేతంగా చొరవ తీసుకుని ప్రధాని, కేంద్రంతో మాట్లాడి రాష్ట్ర హైకోర్టులో బెంచీల సంఖ్య 24 నుంచి 42కి పెంచేలా చేశారని వివరించారు. రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం తరఫున జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. దేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఉండటం గర్వకారణమని చెప్పారు. ఆయన ఆశీస్సులు, మద్దతు ఎల్లవేళలా ఉండాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. బెంచీల సంఖ్య పెరిగిన నేపథ్యంలో 885 అదనపు పోస్టులను హైకోర్టుకు కేటాయించామన్నారు. జిల్లా, సివిల్‌ కోర్టుల్లో పనిభారం ఎక్కువనే సమాచారం ఉందని.. ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని హైకోర్టు సీజే జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మను సీఎం కోరారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని