CM KCR: దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా తెలంగాణ: సీఎం కేసీఆర్‌

తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ 8 ఏళ్లలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారామని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Updated : 02 Jun 2022 15:21 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ 8 ఏళ్లలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పబ్లిక్‌గార్డెన్‌లో జాతీయ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, జరిగిన ప్రగతిని వివరించారు. ఎంతో అభివృద్ధిని సాధించామని చెప్పారు. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు.

‘‘2014-19 మధ్య 17.24 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థాయిలో నిలిచాం. విద్యుత్‌ రంగంలో స్వయం సమృద్ధి సాధించాం. మిషన్‌ భగీరథ పథకం అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. రాష్ట్రంలో బిందెల కొట్లాట, తాగునీటి కోసం యుద్ధాలు లేవు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపరిచాం. దేశంలో అత్యుత్తమ వైద్యసేవలు అందించే తొలి 3 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.  తెలంగాణ ఏర్పడిన తర్వాత లక్షా 35వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.. మరో 90వేలు భర్తీ చేస్తున్నాం. స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నాం. 

సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం..

సమైక్య పాలనతో పోల్చితే అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించాం. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నాం. మానవీయ కోణంలో అనేక పథకాలు అమలు చేస్తున్నాం. విద్యుత్‌ రంగంలో స్వయం సమృద్ధి సాధించాం. మిషన్‌ భగీరథ పథకం అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. 75 ఏళ్లలో దేశంలో ఏ రాష్ట్రం కూడా సాధించని విజయాలను ఈ 8 ఏళ్లలో తెలంగాణ సాధించింది. రాష్ట్రం ఏర్పడే నాటికి.. నేటికీ ఉన్న స్థితిగతుల్లో పోలికే లేదు.

దళితబంధుతో ఎస్సీల జీవితాల్లో గణనీయమైన మార్పు

ఆర్థిక వృద్ధి, తలసరి ఆదాయం పెరుగుదల, విద్యుత్తు సరఫరా, తాగునీరు.. సాగునీటి సదుపాయం, ప్రజాసంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేస్తున్నాం. ఇప్పటికే 15లక్షలకు పైగా ఎకరాలను స్థిరీకరణ చేసుకున్నాం. ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. దళితబంధు కోసం బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు కేటాయించాం. ఈ పథకం ఎస్సీల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొస్తుంది.

ఆర్థికంగా బలహీనపరిచే కుతంత్రాలు..

ఉమ్మడి జాబితా పేరుతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పెరుగుతోంది. బలమైన కేంద్రం.. బలహీనమైన రాష్ట్రాల సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతున్నారు. కేంద్రం విధించిన ఆర్థిక ఆంక్షలు తెలంగాణకు గుదిబండగా మారాయి. అడుగడుగునా వివక్ష చూపిస్తోంది. మన రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడే రుణాలను సేకరిస్తున్నాం. రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలి. రాష్ట్రాల హక్కులను హరించడాన్ని ఇకనైనా ఆపాలి. ధాన్యం కొనుగోళ్లకు అనేక కొర్రీలు పెట్టింది. మీటర్ల విషయంలో రైతులపై భారం వేసేందుకు మేం సిద్ధంగా లేం. 

ఇంకెన్నాళ్లు కులం, మతం అని కొట్టుకుంటాం?

కేంద్ర ప్రభుత్వానికి సరైన లక్ష్యం లేదు. దేశంలో మతపిచ్చి తప్ప వేరే చర్చ లేదు. చుక్కాని లేని నావలా కేంద్రానిది గాలివాటు పరిపాలన. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా దారిద్ర్యం ఎందుకు ఉంది?వనరులను సరిగా వాడుకోలేని అసమర్థతకు బాధ్యులెవరు?దేశ సమస్యలు పరిష్కరించేందుకు ప్రగతిశీల అజెండా కావాలి. దేశానికి సరికొత్త గమ్యం, లక్ష్యంపై స్పష్టత అవసరం. ప్రజల జీవితాల్లో మౌలిక మార్పు తేవాలి. ఇంకా ఎన్నాళ్లు కులం, మతం అంటూ కొట్టుకుంటాం? విద్వేష రాజకీయాల్లో చిక్కి దేశం విలవిల్లాడుతోంది’’ అని కేసీఆర్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని