CM KCR: ఉద్యమానికి నాయకత్వం.. నా జీవితం ధన్యమైంది: కేసీఆర్

ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం నుంచే తెలంగాణ దోపిడీకి గురైందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇప్పుడు దేశంలోనే బలీయమైన శక్తిగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు.

Updated : 02 Jun 2023 12:02 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం నుంచే తెలంగాణ దోపిడీకి గురైందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇప్పుడు దేశంలోనే బలీయమైన శక్తిగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సచివాలయంలో నిర్వహించిన వేడుకల్లో జాతీయ జెండాను సీఎం ఎగురవేశారు. అనంతరం భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు కేసీఆర్‌ నివాళులర్పించారు. సచివాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు జరిగిన పరిణామాలు గుర్తు చేశారు. 2014లో భారాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన చర్యలను సీఎం వివరించారు.

నిర్వేదం, నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి..

‘‘1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి రక్తసిక్తమైంది. ఉద్యమాన్ని అప్పటి ఆంధ్రా పాలకులు కుట్రలతో అణచివేశారు. 2001 వరకు ఇంకెక్కడి తెలంగాణ? అనే నిర్వేదం జనంలో అలముకుంది. ఆ నిర్వేదం, నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతూ ఉద్యమం మళ్లీ ఎగిసిపడింది. దానికి నాయకత్వం వహించే చారిత్రక పాత్ర నాకు లభించడంతో నా జీవితం ధన్యమైంది. శాంతియుత పంథాలో వివేకమే పునాదిగా వ్యూహత్మకంగా సాగిన మలిదశ ఉద్యమంలోకి క్రమంగా అన్ని వర్గాలు వచ్చి చేరాయి. ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మేధావులు, విద్యావంతులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు, కార్మికులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు విభేదాలకు తావివ్వకుండా ఏకోన్ముఖులై ముందుకు కదిలారు. వారందరికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తలవంచి నమస్కరిస్తున్నాను. స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించి త్యాగధనులైన అమరులకు నివాళులర్పిస్తున్నాను. 

ఎవరూ కలలోనూ ఊహించని పథకాలు

2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారాస ప్రభుత్వం అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనసా, వాచా, కర్మణా అంకితమైంది. ప్రతి రంగంలోనూ యావద్దేశం నివ్వెరపోయేలా ఫలితాలను సాధిస్తూ ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణ.. నేడు పదో వసంతంలోకి అడుగుపెట్టడం ఓ మైలురాయి. కలలో కూడా ఎవరూ ఊహించని విధంగా పథకాలను తీసుకొచ్చాం. రాష్ట్ర పథకాల పట్ల దేశమంతటా ఆదరణ కనిపిస్తోంది. సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ యుగాన్ని ఆవిష్కరించింది. సంపద పెంచుదాం..ప్రజలకు పంచుదాం అనేదే మా నినాదం. దశాబ్ది వేడుకల వేళ పోడు భూములకు పట్టాలు ఇస్తాం. పోడు భూములకూ రైతుబంధు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటాం. మన రైతుబంధు పథకం.. కేంద్ర పాలకుల కళ్లు తెరిపించింది. శుద్ధి చేసిన తాగునీరు ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. తాగునీటి అంశంలో  రాష్ట్రానిది దేశంలోనే ప్రథమస్థానం. మిషన్‌ భగీరథకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. 

ఈ పదేళ్ల కాలం.. సాగునీటి రంగానికి స్వర్ణయుగం

తెలంగాణ వస్తే అంధకారమేనని గతంలో పాలకులు ఎద్దేవా చేశారు. ఇప్పుడు విద్యుత్తు విషయంలో విప్లవాత్మక విజయాలు సాధించాం. ఈ పదేళ్ల కాలం సాగునీటి రంగానికి స్వర్ణయుగం. పాత ప్రాజెక్టులను ఆధునీకరించాం. సమైక్య రాష్ట్రంలో మూలనపడ్డ ప్రాజెక్టులు పూర్తిచేశాం. కాళేశ్వరం నిర్మాణం దేశ చరిత్రలో అపూర్వ ఘట్టం. 20కి పైగా రిజర్వాయర్లతో రాష్ట్రం పూర్ణకుంభంలా మారింది. కోటీ 25లక్షల ఎకరాలకు సాగునీటి  స్వప్నం త్వరలోనే సాకారం కానుంది. ధాన్యం ఉత్పత్తిలో మన రాష్ట్రం మొదటి స్థానానికి పోటీ పడుతోంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి.. రాష్ట్ర రూపురేఖలనే మార్చేశాయి. కొత్త చట్టంతో స్థానిక సంస్థల్లో అద్భుత మార్పు వచ్చింది. ఇటీవల మన పల్లెలకు 13 జాతీయ అవార్డులు వచ్చాయి. మన పురపాలికలు అనేక జాతీయ అవార్డులు పొందాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022 లో రాష్ట్రానికి 23 అవార్డులు వచ్చాయి. హైదరాబాద్‌ అభివృద్ధిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

దళితబంధు.. రెండో విడతలో 1.30లక్షల మందికి..

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బోధనలే శిరోధార్యంగా భావించిన తెలంగాణ ప్రభుత్వం.. దళితులు స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే ఉద్దేశంతో ‘దళితబంధు’ అనే విప్లవాత్మక పథకాన్ని తీసుకొచ్చింది. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షల మొత్తాన్ని వందశాతం గ్రాంట్‌గా అందిస్తోంది. దీన్ని లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ డబ్బుతో దళితులు తమకు నచ్చిన ఉపాధిని ఎంచుకుని ఆత్మగౌరవంతో జీవించేందుకు ప్రబుత్వం అండదండలు అందిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 50వేల మంది లబ్ధిదారులకు రూ.5వేల కోట్లు అందజేశాం. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.17,700కోట్లు కేటాయించాం. రెండో విడతలో 1.30లక్షల మందికి దళితబంధు అందించనున్నాం.

స్వరాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి 21 రోజులపాటు గ్రామం నుంచి రాజధాని వరకు ప్రజలంతా ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొనాలి’’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని