CM Revanth reddy: ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ.. త్వరలో విధివిధానాలు: రేవంత్‌రెడ్డి

వ్యవసాయాన్ని పండుగ చేయడమే కాంగ్రెస్‌ విధానమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

Published : 21 Jun 2024 19:22 IST

హైదరాబాద్‌: వ్యవసాయాన్ని పండుగ చేయడమే కాంగ్రెస్‌ విధానమని, రైతులకు ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. కేబినెట్‌ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ, సోనియా గాంధీ.. ఏదైనా మాట చెబితే అది శిలా శాసనం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని నిలబడి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం మా నాయకుల గొప్పతనం.. కమిట్‌ మెంట్‌. 2022 మే 6  వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ సభలో రాహుల్‌ గాంధీ రుణమాఫీ హామీ ఇచ్చారు. రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2014, 2018లో రుణమాఫీ చేసింది. మొదటిసారి రూ.16వేల కోట్లు, రెండో సారి రూ.12వేల కోట్లు రుణమాఫీ చేసింది. అప్పటి ప్రభుత్వం 2018 డిసెంబరు 11 కటాఫ్‌ తేదీగా నిర్ణయించింది. మా ప్రభుత్వం 2018 డిసెంబరు 12 నుంచి మొదలు పెట్టి.. 2023 డిసెంబరు 9 వరకు కటాఫ్ తేదీగా పరిగణనలోకి తీసుకుంది. ఐదేళ్ల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న రుణాలు రూ.2లక్షల వరకు మాఫీ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. రుణమాఫీతో 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతు భరోసా అమలుపై మంత్రివర్గ ఉపసంఘం వేశాం. జులై 15లోపు ఉప సంఘం నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఆధారంగా రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేస్తాం. రుణమాఫీ కోసం రూ.31వేల కోట్లు అవసరమని అంచనా వేశాం. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలను ఇకపై మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందిస్తారు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని