Revanth Reddy: 6 సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.

Updated : 08 Jul 2024 14:34 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తక్కువ ఖర్చుతో రైతులకు మేలు జరిగే విధంగా 6 ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా వినియోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నిధులు ఖర్చు పెట్టినవి, ఆగిపోయినవి, గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గోదావరి, కృష్ణా బేసిన్‌లో అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలను ఇరిగేషన్‌ ఇంజినీర్ల నుంచి అడిగి తెలుసుకున్నారు.

గోదావరి బేసిన్‌లో ఉన్న నీలం వాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెంవాగు, మత్తడి వాగు, ఎస్సార్‌ఎస్పీ స్టేజీ 2, సదర్మట్‌ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు దాదాపు రూ.241 కోట్లు ఖర్చవుతుందని,  వీటి ద్వారా 48వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని నీటిపారుదల శాఖ అంచనా వేసింది. తక్కువ నిధులతో పూర్తయ్యే ప్రాజెక్టులను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని, మార్చి 2025 నాటికి వందశాతం పనులు పూర్తవ్వాలని అధికారులకు తేల్చి చెప్పారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని, రైతులకు సాగునీరు అందించాలంటే ఆయకట్టు భూములకు నీళ్లు పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.

నీలం వాగు ద్వారా మంచిర్యాల జిల్లా, పింప్రి ప్రాజెక్ట్‌ ద్వారా నిర్మల్‌ జిల్లా, పాలెం వాగుతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, మత్తడివాగుతో ఆదిలాబాద్‌ జిల్లా, ఎస్సార్‌ఎస్సీ స్టేజీ 2తో వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, జనగాం, సూర్యాపేట జిల్లాలకు, సదర్మట్‌ ప్రాజెక్టుతో నిర్మల్‌ జిల్లాలోని రైతులకు సాగునీరు అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు