Cycle: సోలార్‌ ఎలక్ట్రిక్‌ సైకిల్‌.. @40 కి.మీ.

దేశంలో పెట్రోల్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న వేళ అతితక్కువ ఖర్చుతో ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేశాడు మధురైకి చెందిన ఓ విద్యార్థి. సోలార్ బ్యాటరీ ఛార్జింగ్‌తో నడిచే ఈ సైకిల్....

Published : 12 Jul 2021 01:14 IST

మధురై: దేశంలో పెట్రోల్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న వేళ అతితక్కువ ఖర్చుతో ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేశాడు మధురైకి చెందిన ఓ విద్యార్థి. సోలార్ బ్యాటరీ ఛార్జింగ్‌తో నడిచే ఈ సైకిల్ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.  ప్రయాణానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువే.

దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో చాలా మంది ఔత్సాహికులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు చెందిన ధనుష్‌కుమార్‌ అనే విద్యార్థి సౌర శక్తితో నడిచే ఎలక్ట్రిక్‌ సైకిల్‌ను రూపొందించాడు. మధురైకి చెందిన ధనుష్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేశాడు. చిన్నప్పటి నుంచే నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తి ఉన్నట్లు తెలిపిన ధనుష్‌.. ఆ ఆసక్తితోనే సోలార్‌ సైకిల్‌ను రూపొందించినట్లు వివరించాడు.

విద్యుచ్ఛక్తితో నడిచే ఈ సైకిల్‌కు అనేక ప్రత్యేకతలున్నాయి. బ్యాటరీ ఒక్కసారి ఫుల్‌ ఛార్జింగ్‌ పెడితే 50 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని ధనుష్‌ వివరించాడు. తక్కువ ఛార్జింగ్‌ ఉన్నప్పుడు కూడా 20 కిలోమీటర్ల వరకు ఆగకుండా ప్రయాణిస్తుందని తెలిపాడు. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలతో పోలిస్తే రవాణా ఖర్చు చాలా తక్కువని పేర్కొన్న ధనుష్‌.. కిలోమీటరకు రూ.1.5 మాత్రమే ఖర్చవుతుందన్నాడు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ సైకిల్‌పై ప్రయాణించవచ్చని చెప్పాడు. సీటుకు వెనకవైపు అమర్చిన రెండు సోలార్‌ ప్లేట్ల ద్వారా బ్యాటరీ ఛార్జింగ్‌ అవుతుందని తెలిపాడు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ధనుష్‌ ఆవిష్కరణకు మధురైలో ప్రశంసలు దక్కుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని