Balashouri: రాబోయే రోజుల్లో గన్నవరం నుంచి మరిన్ని విమాన సర్వీసులు: ఎంపీ బాలశౌరి

రాబోయే రోజుల్లో గన్నవరం నుంచి మరిన్ని నూతన విమాన సర్వీసులు నడిపేందుకు కృషి చేస్తామని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ అన్నారు.

Published : 15 Jun 2024 18:45 IST

విజయవాడ: రాబోయే రోజుల్లో గన్నవరం నుంచి మరిన్ని నూతన విమాన సర్వీసులు నడిపేందుకు కృషి చేస్తామని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ అన్నారు. విజయవాడ - ముంబయి విమాన సర్వీసు ప్రారంభోత్సవానికి వీరు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడారు. ‘‘గన్నవరం నుంచి ముంబయికి ఎయిర్ లైన్స్ సర్వీస్ ప్రారంభించాం. ఈ విమానం ముంబయిలో మధ్యాహ్నం 3.57 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. రాత్రి 7.10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 9.00 గంటలకు ముంబయిలో ల్యాండ్‌ అవుతుంది. ఈ ప్రాంత ప్రజలకు ఈ సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. 

రాబోయే రోజుల్లో విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకు మరిన్ని సర్వీసులను విస్తరిస్తాం. గన్నవరం నుంచి కోల్‌కతాకు విశాఖ మీదుగా విమాన సర్వీసు నడిపే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. వారానికి రెండు రోజులు వారణాసి వెళ్లేందుకు కొత్త విమాన సర్వీసు కోసం ప్రయత్నిస్తున్నాం. విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే విమాన సర్వీసును మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. థాయ్‌లాండ్‌, శ్రీలంక సర్వీసులు తీసుకొచ్చేందుకు.. దిల్లీ నుంచి మరో రెండు సర్వీసులు అదనంగా వేసేలా మా వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాం. గుత్తేదారు వల్ల కొత్త టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం ఆలస్యమైంది. దాన్ని త్వరలోనే పూర్తి చేస్తాం’’ అని బాలశౌరి వివరించారు.

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ మాట్లాడుతూ ‘‘బాలశౌరి చొరవతో ముంబయికి సర్వీసులను నడిపేందుకు ఎయిరిండియా ముందుకొచ్చింది. ఏఐ599 సర్వీసులో 180 సీటింగ్‌ కెపాసిటీ ఉంటుంది. వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులను కూడా ఈ సర్వీసు ద్వారా ముంబయికి.. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని