Health: పొట్టలో అవసరమైన బ్యాక్టీరియాను రక్షించుకోవడం ఎలా?

శరీరంలోని ముఖ్యభాగాల్లో ఉదరానికి ప్రత్యేక స్థానముంది. మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడంతోపాటు శరీరానికి అవసరమైన పోషకాలను శోషించుకొని వ్యర్థాలను బయటకు నెట్టివేయడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీర్ణాశయం, పేగుల్లో విడుదలయ్యే ఆమ్లాలను సమతాస్థితిలో ఉంచేందుకు సహకరిస్తుంది...

Updated : 24 Oct 2021 16:26 IST

శరీరంలోని ముఖ్యభాగాల్లో ఉదరానికి ప్రత్యేక స్థానముంది. మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడంతోపాటు శరీరానికి అవసరమైన పోషకాలను శోషించుకొని వ్యర్థాలను బయటకు నెట్టివేయడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీర్ణాశయం, పేగుల్లో విడుదలయ్యే ఆమ్లాలను సమతాస్థితిలో ఉంచేందుకు సహకరిస్తుంది. పొట్టలో శరీరానికి అవసరమైన లక్షలాది బ్యాక్టీరియాలు ఉంటాయి. జీర్ణక్రియను సాఫీగా పూర్తి చేయడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. అయితే చిన్న చిన్న అలవాట్ల వల్ల పొట్ట పని తీరు మందగించి, అనారోగ్యం పాలయ్యే అవకాశాలున్నాయి.

1. ప్రొబయోటిక్స్‌ లేమి

ప్రొబయోటిక్స్‌ శరీరానికి చాలా అవసరం. పొట్టలోని అవసరమైన బాక్టీరియా వృద్ధి చెందడానికి ఇవి చాలా దోహదం చేస్తాయి. అరటిపళ్లు, యాపిల్‌, ఉల్లి, వెల్లుల్లి తదితర ఆహారపదార్థాల్లో ప్రొబయోటిక్స్‌ ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల ఉదర సంబంధిత వ్యాధులు దరి చేరవు. అందువల్ల మనం తినే ఆహారంలో కచ్చితంగా ప్రొబయోటిక్స్‌ ఉండేలా చూసుకోవాలి.

2. తియ్యని పదార్థాలు

తియ్యగా ఉండే పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల పొట్ట పని తీరు మందగిస్తుంది. ఉదరంలోని శరీరానికి అవసరమైన బాక్టీరియాపై తీపి పదార్థాలు ప్రభావం చూపిస్తాయి. చక్కెర స్థాయుల్లోనూ సమతాస్థితి లోపించి కడుపులో మంట లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

3. సరిగా నిద్రలేకపోవడం

కంటి నిండా నిద్రపోయినప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాకుండా ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోయేలా చూసుకోవాలి. నిద్రలేమి వల్ల అలసట, చిరాకు, ఎసిడిటీ లాంటి సమస్యలు తలెత్తుతాయి. సరిగా నిద్రలేకపోతే దీర్ఘకాలిక ఒత్తిడికి గురవుతారు. ఫలితంగా ఉదర సంబంధిత వ్యాధుల ముప్పు ఉంటుంది.

4. డీహైడ్రేషన్‌

ఆరోగ్యంగా ఉండాంటే శరీరంలో తగినంత నీరు ఉండాలి. అందువల్ల రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగమని ఆరోగ్యనిపుణులు చెబుతుంటారు. నీరు ఎక్కువగా తాగడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. అంతేకాకుండా చర్మం కాంతివంతంగా తయారవుతుంది. పేగుల్లో వ్యర్థాలు పేరుకుపోవు. అందువల్ల మలబద్దకం లాంటి సమస్యలు కూడా దరి చేరకుండా పొట్ట అరోగ్యంగా ఉంటుంది.

5. మద్యపానం

అతిగా మద్యం తాగడం వల్ల పొట్టలో ఉండే అవసరమైన బాక్టీరియా నశించిపోతుంది. దీనినే డైస్బియోసిస్‌ అంటారు. ఫలితంగా జీర్ణక్రియలో అంతరాయం ఏర్పడి ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముంది. అయితే తక్కువ మోతాదులో అప్పడప్పుడూ మద్యం తాగితే బాక్టీరియాపై అంతగా ప్రభావం ఉండబోదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

6. వ్యాయామం చేయకపోవడం

ఆరోగ్యానికి వ్యాయామం చాలా అవసరం. ప్రతి రోజూ కసరత్తులు చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా రక్తప్రసరణ మెరుగవుతుంది. కేవలం వ్యాయామం మాత్రమే చేయాలన్న నిబంధనేమీ లేదు.. ఆటలు, యోగా వల్ల కూడా పొట్ట ఆరోగ్యం మెరుగవుతుంది.

7. పీచుపదార్థాలు చాలా అవసరం

ఆహారంలో పీచు పదార్థాలు తక్కువగా ఉంటే మలబద్దకం లాంటి ఉదర సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. ఫైబర్‌ వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. చక్కెర స్థాయులు కూడా అదుపులో ఉంటాయి. కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని