Exams Calendar2023: విద్యార్థులకు ‘పరీక్ష’ కాలం.. ముఖ్యమైన పోటీ పరీక్షల తేదీలివే..!

విద్యార్థులకు ఇది పరీక్షా కాలమ్‌. వార్షిక పరీక్షలకు తోడు పోటీ పరీక్షలూ సమీస్తున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే కీలక పరీక్షల తేదీలివే.. 

Published : 05 Jan 2023 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇది పరీక్షల సీజన్‌(exams season). విద్యార్థులు తమలోని సత్తా చాటేలా సర్వసన్నద్ధమయ్యేందుకు అత్యంత కీలక సమయం. ఓవైపు వార్షిక పరీక్షలు సమీపిస్తుండగా.. మరోవైపు, ఉన్నత చదువులు/ పైతరగతులకు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్షల తేదీలూ దగ్గరపడుతున్నాయి. దీంతో వీటిని సమతుల్యం చేసుకొనేలా విద్యార్థులు తమను తాము సమాయత్తం చేసుకోవడంతో పాటు పక్కా ప్రణాళికలతో సన్నద్ధం(Preparation) కావడం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే కొన్ని ముఖ్యమైన పోటీ పరీక్షల తేదీలను ఓసారి చూద్దాం..

  1. జేఈఈ మెయిన్‌: దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌(JEE Main 2023) మొదటి విడత జనవరి 24 నుంచి 31 వరకు జరగనుంది. అనూహ్యంగా వచ్చే ఆటంకాలను దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు కూడా నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)సన్నాహాలు చేసింది. 
  2. జేఈఈ మెయిన్‌ రెండో విడత ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఏవైనా ఆటంకాలు ఎదురైతే ఏప్రిల్‌ 13, 15 తేదీలను కూడా అందుబాటులో ఉంచినట్టు ఎన్‌టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్‌(JEE Main) పరీక్షలకు లక్షలాది మంది విద్యార్థులు పోటీపడుతుంటారు.
  3. జేఈఈ అడ్వాన్స్‌డ్‌: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ(IITs)ల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష(JEE Advanced Exam) పరీక్షను జూన్‌ 4న నిర్వహించనున్నారు. ఈసారి ఈ పరీక్షను ఐఐటీ గువాహటి(IIT Guwahati) నిర్వహిస్తోంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ పరీక్ష కోసం ఏప్రిల్‌ 30 నుంచి మే 4 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 
  4. నీట్‌ యూజీ 2023: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ-2023 (NEET UG 2023) పరీక్ష మే 7న జరగనుంది. 
  5. నీట్‌ (పీజీ) 2023: పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే నీట్‌ పీజీ పరీక్ష(NEET PG exam 2023) మార్చి 5న జరగనుంది. దేశవ్యాప్తంగా 367 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు నేషనల్ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (NBE) వెల్లడించింది.
  6. క్యూట్‌ 2023: దేశంలోని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష క్యూట్‌-2023 (CUET 2023) పరీక్ష మే 21 నుంచి 31 మధ్య నిర్వహించనున్నట్టు ఎన్‌టీఏ ప్రకటించింది. ఈ పరీక్షలకు సంబంధించి ఏవైనా ఆటంకాలు ఎదురైతే జూన్‌ 1 నుంచి 7వరకు తేదీలను రిజర్వు చేసింది. 
  7. యూజీసీ నెట్‌ 2022: జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడేందుకు అవకాశం కల్పించే  యూజీసీ - నెట్‌(UGC-NET) డిసెంబర్‌ 2022 పరీక్ష ఫిబ్రవరి 23 నుంచి మార్చి 10వరకు జరగనుంది. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే  కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష కోసం జనవరి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తుంటారు.
  8. గేట్‌2023: ప్రతిష్ఠాత్మక ఐఐటీలతోపాటు ఐఐఎస్‌సీ బెంగళూరు, వివిధ ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్‌/ ఫార్మసీ విభాగాల్లో  పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే గేట్‌ 2023 పరీక్ష(GATE Exam2023) ఫిబ్రవరిలో జరగనుంది. గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌)- 2023 పరీక్ష ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఐఐటీ కాన్పూర్‌ వెల్లడించింది. మార్చి 16న ఫలితాలు వెల్లడికానున్నాయి. 
  9. నవోదయ పరీక్ష: దేశవ్యాప్తంగా 649 జవహర్‌ నవోదయ విద్యాలయ (JNV)ల్లో ఆరో తరగతి ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 29న జరగనుంది. ఈ పరీక్ష కోసం జనవరి 31వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య పొందొచ్చు. 
  10. సైనిక పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష: రక్షణరంగంలో సేవలందించాలనే లక్ష్యంతో సైనిక పాఠశాలల్లో(Sainik Schools) ఆరు, తొమ్మిదో తరగతుల్లో చేరాలనుకొనే వారికి నిర్వహించే ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ పరీక్ష(aissee) జనవరి 8న జరగనుంది. దేశవ్యాప్తంగా 33 సైనిక పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది నుంచి కొత్తగా 18 స్కూళ్లు ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో ప్రారంభం కానున్నాయి. వీటికోసం నవంబర్‌ 30 వరకు దరఖాస్తులు స్వీకరించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు