కంప్యూటర్‌తో కొవిడ్‌ మరణాలు ముందే గుర్తింపు

కరోనా సోకిన వారికి కొందరిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండగా.. మరికొందరిలో మాత్రం స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సైతం ఉన్నట్టుండి ప్రాణాలు........

Published : 07 Feb 2021 00:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సోకిన వారికి కొందరిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండగా.. మరికొందరిలో మాత్రం స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సైతం ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, ఓ వ్యక్తి కరోనా కారణంగా మరణిస్తాడా? లేదా? అనేది ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), రోగి ఆరోగ్య సమాచారం ఆధారంగా 90 శాతం కచ్చితత్వంతో అంచనా వేయొచ్చని అంటున్నారు పరిశోధకులు. వ్యక్తి బీఎంఐ, లింగం, హైబీపీ వంటివి కొవిడ్‌ మరణాలకు ప్రధాన కారకాలని యూనివర్సిటీ ఆఫ్‌ కోపెన్‌హగెన్‌ పరిశోధకులు పేర్కొన్నారు. జర్నల్‌ సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌లో ఈ పరిశోధన ప్రచురితమైంది. ప్రమాదపు అంచున ఉన్న వ్యక్తులను ముందుగా గుర్తించి వారికి వ్యాక్సిన్‌ వేసేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

డెన్మార్క్‌ క్యాపిటల్‌ రీజియన్‌, రీజియన్‌ జీలాండ్‌ పరిధిలోని 3,944 మంది కొవిడ్‌ రోగుల డేటాను ఇందుకోసం పరిశోధకులు సంగ్రహించారు. వ్యక్తులకున్న వ్యాధులు, ఆరోగ్య సమాచారం ఆధారంగా ఏఐ సాయంతో పరిశోధన చేపట్టారు. కొవిడ్‌ బారిన తీవ్రంగా పడిన వారిలో వయసు, బీఎంఐ వంటివి మరణం ముప్పునకు ప్రధాన కారకాలుగా అంచనా వేశారు. అందులోనూ పురుషులై ఉండి, హైబీపీ లేదా నాడీ సంబంధ వ్యాధులు ఉన్నవారిలో మరణం ముప్పు, కృత్రిమ శ్వాస అవసరం అవ్వడం వంటివి గుర్తించినట్లు యూనివర్సిటీ ఆఫ్‌ కోపెన్‌ హగెన్‌లోని కంప్యూటర్‌సైన్స్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ మ్యాడ్స్‌ నీల్సన్‌ తెలిపారు. ఇవి కాక సీవోపీడీ, ఆస్తమా, డయాబెటిస్‌, గుండె సంబంధిత వ్యాధులు కూడా కారణమని పేర్కొన్నారు. వీటిలో ఒకటీ లేదా అంతకంటే ఎక్కువ పరామితులు కలిగి ఉన్న వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడంలో ప్రాధాన్యం ఇవ్వాలని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే, డాక్టర్‌ను కంప్యూటర్‌ భర్తీ చేయలేదని పరిశోధకులు పేర్కొన్నారు. ముప్పు ముంగిట ఉన్న రోగులను గుర్తించేందుకు ఆసుపత్రులు, వైద్యులకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే, రోగుల ఆరోగ్య సమాచారం సేకరించడం కూడా అంతసులువేమీ కాదని అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి..
కరోనా:భారత్‌ను ప్రశంసించిన డబ్ల్యూహెచ్‌ఓ
భారత్ టీకా కోసం వరసలో 25 దేశాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని