Corbevax: కొర్బెవాక్స్‌కు డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర అనుమతి కోసం వేచి చూస్తున్నాం: మహిమా దాట్ల

బయోలాజికల్‌-ఈ సంస్థ తయారుచేసిన కొర్బెవాక్స్‌ టీకా దేశ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రావడం పట్ల సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నగరంలోని....

Published : 16 Mar 2022 20:28 IST

హైదరాబాద్‌: బయోలాజికల్‌-ఈ సంస్థ తయారుచేసిన కొర్బెవాక్స్‌ టీకా దేశ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రావడం పట్ల సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ ఎండీ మహిమా దాట్ల, గ్లోబల్‌ స్ట్రాటజీ హెడ్‌ నరేంద్ర దేవ్‌ మంతెన, సీఓఓ లక్ష్మీనారాయణ నేతి సహా పలువురు బయోలాజికల్‌-ఈ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిమా దాట్ల మాట్లాడుతూ... దాదాపు 3వేల మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించినట్టు చెప్పారు. దేశ వ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కొర్బెవాక్స్‌ టీకా ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఒక్కో డోస్‌ 149 రూపాయలకు ఇస్తునట్టు తెలిపారు. అయితే, బహిరంగ మార్కెట్లో మాత్రం రూ.800లకు దొరుకుతుందన్నారు. కొర్బెవాక్స్‌ టీకాను విదేశాలకు ఎగుమతి చేసేందుకు డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర అనుమతుల కోసం వేచి చూస్తున్నట్టు పేర్కొన్నారు.

అంతా హైదరాబాద్‌ వైపే చూసే పరిస్థితి: హరీశ్‌రావు

ప్రపంచంలో కొత్త వ్యాక్సిన్‌ కావాలంటే అంతా హైదరాబాద్‌ వైపే చూసే పరిస్థితి వచ్చిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. దేశంలో కొవిడ్‌కు 3 టీకాలు వస్తే అందులో కొవాగ్జిన్‌, కొర్బెవాక్స్‌ వాక్సిన్లు హైదరాబాద్‌ నుంచే రావడం గర్వకారణమన్నారు. ఖైరతాబాద్‌లో 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, బయోలాజికల్‌-ఈ ఎండీ మహిమా దాట్ల పాల్గొన్నారు. కొవిడ్‌ ప్రభావం తగ్గిపోయిందనుకోవడం చాలా పొరపాటని, చైనా, హాంకాంగ్‌, అమెరికాలో మళ్లీ కేసులు వస్తున్నాయని హరీశ్‌రావు తెలిపారు. అందరూ విధిగా కొవిడ్‌ టీకా తీసుకోవాలని కోరారు.

తెలంగాణలో 12-14 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కొవిడ్‌ టీకాలను అందజేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం అన్ని గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వీరికి టీకాలను అందజేస్తున్నారు. 2010 మార్చి.. అంతకంటే ముందు పుట్టిన పిల్లలు టీకాలకు అర్హులని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కొవిన్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టీకాను పొందడానికి స్లాట్‌ను బుక్‌ చేసుకోవచ్చనీ, లేదంటే నేరుగా టీకా కేంద్రానికి వచ్చి కూడా పొందవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 12-14 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లలు 17,23,000 మంది ఉన్నారు. వీరందరికీ కొర్బెవాక్స్‌ టీకాను అందిస్తామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని