Cordelia cruise: విలాసాల ‘కార్డేలియా’.. విశాఖ వచ్చేసింది!

విలాస వంతమైన సముద్ర విహార నౌక ‘కార్డేలియా’ విశాఖపట్నంలో అందుబాటులోకి వచ్చింది. ఈ షిప్‌ బుధవారం ఉదయం వైజాగ్‌ పోర్టుకు చేరుకుంది.

Updated : 08 Jun 2022 12:33 IST

విశాఖపట్నం: విలాస వంతమైన సముద్ర విహార నౌక ‘కార్డేలియా’ విశాఖపట్నంలో అందుబాటులోకి వచ్చింది. ఈ షిప్‌ బుధవారం ఉదయం వైజాగ్‌ పోర్టుకు చేరుకుంది. భారత సాగర తీరంలో మాత్రమే ప్రయాణించే ‘కార్డేలియా’.. విశాఖ-పుదుచ్చేరి-చెన్నై-విశాఖ మార్గంలో తొలిసారిగా తన సేవలు అందిస్తోంది. 

‘కార్డేలియా క్రూయిజ్‌’ సంస్థ నడిపుతున్న ఈ విలాసాల నౌకను సముద్రంలో తేలియాడే ఓ స్టార్‌హోటల్‌ అనొచ్చు! ఆ హోటళ్లలోలేని సినిమా థియేటర్‌లనీ.. అడ్వెంచర్‌ యాక్టివిటీస్‌నీ కూడా ఇందులో చూడొచ్చు. విశాఖ నుంచి చెన్నైకు మూడు రాత్రులూ నాలుగు పగళ్లుగా ఈ పర్యటక ప్యాకేజీ ఉంటుంది. ఇందులో ఒక్కసారే పదిహేనువందలమందిదాకా ప్రయాణించవచ్చు. ఈ షిప్‌లో విశాఖ నుంచి చెన్నై వెళ్లేందుకు 36 గంటల సమయం పడుతుంది. ఇప్పటికే ఈ పర్యటక ప్యాకేజీ టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. మొత్తం 11 అంతస్తులు ఉండే ఈ నౌకలో ఎన్నో అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. 

ఇంజిన్‌కీ, సరకులకీ కిందున్న రెండు అంతస్తులు పోగా.. మూడో అంతస్తు నుంచి ప్రయాణికులు బసచేసే గదులు మొదలవుతాయి. అక్కడి నుంచి పదో అంతస్తుదాకా లిఫ్ట్‌లో వెళ్లొచ్చు. 10వ అంతస్తులో ఓ పేద్ద డాబాలాంటి డెక్‌ ఉంటుంది. పదకొండో అంతస్తులో సూర్యోదయం, సూర్యాస్తమయాలని చూడటం కోసం ప్రత్యేకంగా మరో ప్రత్యేక డెక్‌నీ ఏర్పాటుచేశారు. ఇందులో నిల్చుని అనంత సాగరాన్ని వీక్షించడం... ఓ అద్భుతమైన అనుభవమనే చెప్పాలి. పిల్లల ఆటల కోసం కార్డేలియా కిడ్స్‌ అకాడమీ పేరుతో అతిపెద్ద ఆవరణ ఉంటుందిక్కడ. ఇవే కాకుండా జిమ్‌, ఈతకొలను, క్యాసినో, కామెడీ షోల కోసం సభావేదికలూ, కొత్త సినిమాల కోసం థియేటర్‌లూ, 24 గంటలూ పనిచేసే సూపర్‌మార్కెట్లూ ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని