Hyderabad: పోలీసుశాఖను వెంటాడుతోన్నమహమ్మారి.. ఒక్కరోజే 72 మంది పోలీసులకు కొవిడ్‌

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు గణనీయంగా..

Updated : 18 Jan 2022 17:06 IST

హైదరాబాద్‌: తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు గణనీయంగా.. వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మహమ్మారి ప్రభుత్వ కార్యాలయాలపైనా విజృంభిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారిలో పోలీసు శాఖ నుంచి అధికంగా ఉంటున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న పలు పోలీసు స్టేషన్లలో కలిపి మొత్తంగా 72 మంది పోలీసులు వైరస్‌ బారినపడ్డారు. తాజాగా హైదరాబాద్ సీసీఎస్‌, సైబర్ క్రైమ్‌ విభాగాల్లో పనిచేస్తున్న 20 మంది పోలీసు సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఇటీవల సైబర్ క్రైమ్ బృందం ఓ కేసు విషయంలో రాజస్థాన్‌ వెళ్లి వచ్చింది. ఆ బృందంలోని ఒక ఎస్సైకి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతని నుంచి మిగతా సిబ్బందికి సోకినట్లు పోలీసులు భావిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన 20 మంది పోలీసు సిబ్బంది ప్రస్తుతం హోం ఐసోలేషన్‌ ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అలాగే వనస్థలిపురం, అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసు స్టేషన్లలో ఒక్కరు చొప్పున, అల్వాల్‌ పీఎస్‌లో నలుగురు కానిస్టేబుళ్లు కరోనా బారినపడ్డారు. సోమవారం యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్‌లో ఏసీపీ, సీఐ సహా 12 మందికి ఈ వైరస్‌ సోకిన విషయం తెలిసిందే.

నార్సింగి​ పోలీసు ​స్టేషన్‌లో 20 మందికి..

రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పోలీసు స్టేషన్‌లో 20 మంది పోలీసులకు కరోనా సోకింది. ప్రస్తుతం అందరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు వైరస్‌ బారినపడటంతో స్టేషన్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదుదారుల కోసం పోలీసుస్టేషన్‌ ఎదుట ప్రత్యేక టెంట్ వేశారు. ప్రజలంతా మాస్కులు ధరించి.. కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు.

హయత్‌నగర్‌ పీఎస్‌లో 15 మందికి..

నగరంలోని హయత్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో 15 మంది పోలీసులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధరణ అయింది. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోన్న ఎస్‌ఐ, మరో 14 మంది కానిస్టేబుళ్లు వైరస్‌ బారినపడ్డారు. వీరంతా ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

చైతన్యపురి పోలీసు స్టేషన్‌లో..

నగరంలోని చైతన్యపురి పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తోన్న 8 మంది కానిస్టేబుళ్లకు కొవిడ్ పాజిటివ్‌ నిర్ధరణ అయింది. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్‌లో ఉన్నారని ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో పోలీసులు పీఎస్‌లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఫిర్యాదు చేసేందుకు వచ్చేవారు కచ్చితంగా మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.

బీఆర్కే భవన్‌లో..

బీఆర్కే భవన్‌లో కరోనా కలకలం రేగింది. బీఆర్కే భవన్‌లోని సాధారణ పరిపాలన, విద్యాశాఖ సహా పలు విభాగాలకు చెందిన 15 మంది ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారినపడ్డారు. వీరిలో ఐఏఎస్ అధికారులు, పలు విభాగాల ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని