అయినవారిని తీసుకెళ్తూ.. అనాథలుగా మారుస్తూ..

కరోనా మహమ్మారితో చూస్తుండగానే భర్త ఊపిరి ఆగింది. కట్టుకున్నవాడి మరణం నుంచి తేరుకోకముందే ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న మామయ్య కాలం చేశాడు. గుండెలవిసేలా ఏడుస్తుండగానే మరిదిని మహమ్మారి కబళించింది....

Published : 21 May 2021 23:07 IST

అరణ్య రోదనగా మారుతున్న ఆ కుటుంబాల వేదన

జగిత్యాల: చూస్తుండగానే భర్త ఊపిరి ఆగింది. కట్టుకున్నవాడి మరణం నుంచి తేరుకోకముందే ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న మామయ్య కాలం చేశాడు. గుండెలవిసేలా ఏడుస్తుండగానే మరిదిని మహమ్మారి కబళించింది. అయినవారు ఒక్కొక్కరుగా కళ్లముందే దూరమవుతుంటే... కన్నీళ్లు రాల్చటం తప్పిస్తే మరేమీ చేయలేని దైన్యం. నరకమంటే బహుశా ఇలాంటి కుటుంబాలు అనుభవించిన వేదనే అయింటుంది. 

జగిత్యాలలోని గణేశ్‌నగర్‌కు చెందిన దొంతుల సునీల్ ఇటీవల కరోనా బారిన పడి ప్రాణాలు విడిచాడు. మరో రెండ్రోజులకే ఆయన తండ్రి రామచంద్రం.. అంతలోనే సోదరుడు సుమన్ కరోనా మహమ్మారి కాటుకు బలయ్యారు. వారంరోజుల వ్యవధిలోనే ముగ్గురూ మృతిచెందగా కనీసం అంత్యక్రియలు కూడా చేసే వారు లేని పరిస్థితి నెలకొంది. కట్టుకున్న భర్త.. పెద్దదిక్కుగా ఉన్న మామ, బిడ్డలాంటి మరిది కళ్లముందే ప్రాణాలు వదలడంతో సునీల్  భార్య వేదన అరణ్యరోదనగా మారింది. అనాథలుగా మారిపోయామని.. పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆమె ఆవేదన వెల్లగక్కుతున్నారు.

తల్లిదండ్రులను కోల్పోయి.. 
జగిత్యాల గ్రామీణ మండలం చల్‌గల్‌కు చెందిన ఎర్ర రాజేశం దంపతులతోపాటు ఆయన సోదరుడు కరోనా కాటుకు బలయ్యారు. ఇదే గ్రామానికి చెందిన పందిరి భీమిలింగం, ఆయన భార్య వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో మిగిలిన భీమలింగం కుమారుడు, వృద్ధులైన ఆయన తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కరోనా కాటుకు తమవారిని కోల్పోయి ఎన్నో కుటుంబాలు నరకయాతన అనుభవిస్తున్నాయి. 

జగిత్యాల జిల్లాలోనే నెల రోజుల వ్యవధిలో 500 మందికి పైగా మృత్యువాతపడగా ఎంతోమంది రోడ్డున పడ్డారు. లక్షల రూపాయలు ఖర్చుచేసినా ప్రాణాలు దక్కకపోవడంతో బాధితులంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు