Antibodies: కొవిడ్‌ సోకిన చిన్నారులకు.. యాంటీబాడీలతో ఎంతకాలం రక్షణ..?

వైరస్‌ బారినపడి కోలుకున్న పిల్లల్లో సహజంగా వృద్ధి చెందే యాంటీబాడీలు ఏడు నెలల పాటు రక్షణ కల్పిస్తాయని అమెరికాలో జరిపిన అధ్యయనం వెల్లడించింది.

Updated : 22 Mar 2022 01:41 IST

అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనం

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 నుంచి కోలుకున్న వారికి రీ-ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకుండా యాంటీబాడీలు కొంతకాలం రక్షణ కలిగిస్తాయని పరిశోధనలు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే, చిన్నారుల్లో ఇవి ఎంతకాలం ఉంటాయనే విషయంపై ఇప్పటివరకు సరైన సమాచారం లేదు. ఈ నేపథ్యంలో వైరస్‌ బారినపడి కోలుకున్న పిల్లల్లో సహజంగా వృద్ధి చెందే యాంటీబాడీలు ఏడు నెలల పాటు రక్షణ కల్పిస్తాయని అమెరికాలో జరిపిన అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయన వివరాలు పిడియాట్రిక్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

చిన్నారుల్లో కొవిడ్‌ యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయనే అంశంపై అమెరికా టెక్సాస్‌లోని కేర్స్‌ సర్వే బృందం అధ్యయనం చేపట్టింది. వ్యాక్సిన్‌ పంపిణి చేపట్టకముందే జరిపిన ఈ అధ్యయనంలో మొత్తం 218 మంది చిన్నారులను పరిగణనలోనికి తీసుకుంది. ఇందులో భాగంగా 5 నుంచి 19ఏళ్ల వయసుగల కొవిడ్‌ బారినపడిన చిన్నారుల రక్త నమూనాలను సేకరించి మూడు స్థాయిల్లో పరీక్షించింది. తద్వారా కొవిడ్‌ బారినపడిన 96శాతం పిల్లల్లో సహజంగా వృద్ధి చెందిన యాంటీబాడీలు ఏడు నెలలపాటు ఉంటున్నట్లు తేలిందని పరిశోధకులు గుర్తించారు. అయితే, కొందరిలో ఆరు నెలల తర్వాత ఈ రక్షణ తగ్గుతున్నందున.. వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని సూచించారు.

చిన్నారుల్లో కొవిడ్‌ యాంటీబాడీలపై ఈ తరహా అధ్యయనం ఇదే తొలిసారి అని టెక్సాస్‌ కేర్స్‌ సర్వే బృందానికి నేతృత్వం వహించిన ఎపిడమాలజిస్ట్‌ సారా మెసయా వెల్లడించారు. ఇందులో కొవిడ్‌ లక్షణాలు కనిపించని, తీవ్ర లక్షణాలున్న వారిని, బాలబాలికలు, మధుమేహం ఉన్న వారిని.. ఇలా భిన్న వర్గాల పిల్లల్ని పరిగణనలోనికి తీసుకొని పరిశీలించామని చెప్పారు. అందుకే ఈ అధ్యయనం ఎంతో ముఖ్యమైనదని అన్నారు. అయితే, కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో సహజంగా వృద్ధి లభించే యాంటీబాడీలకు తోడు వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల వచ్చే రక్షణ మరింత ఉత్తమమైందని అమెరికా పరిశోధకులు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని