Covid Effect:ముగ్గురిలో ఒకరికి తగినంత ఆహారం లేదు!

కొవిడ్‌ మహమ్మారి వల్ల భూగోళం మీద ఆకలితో అలమటించేవారి సంఖ్య 18 శాతం పెరిగారని ఐక్యరాజ్యసమితి నివేదిక సోమవారం బయటపెట్టింది. ప్రపంచంలో 2030 నాటికి ఎక్కడా ఆకలి కేకలు ఉండకూదనే లక్ష్యాన్ని ఇది నీరుగార్చేలా ఉందని తెలియజేసింది. ‘‘కొవిడ్‌

Updated : 13 Jul 2021 05:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ మహమ్మారి వల్ల భూగోళం మీద ఆకలితో అలమటించేవారి సంఖ్య 18 శాతం పెరిగారని ఐక్యరాజ్యసమితి నివేదిక సోమవారం బయటపెట్టింది. ప్రపంచంలో 2030 నాటికి ఎక్కడా ఆకలి కేకలు ఉండకూదనే లక్ష్యాన్ని ఇది నీరుగార్చేలా ఉందని తెలియజేసింది. ‘‘కొవిడ్‌ కట్టడి చర్యల వల్ల చాలామంది ఆర్థికంగా దిగజారిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి దశాబ్దాల్లో ఎన్నడూ కనిపించని విధంగా పెద్ద ఎత్తున ఆకలి బాధలు పెరిగాయి’’ అని ఐరాసకు చెందిన పలు విభాగాలు సంయుక్తంగా బయటపెట్టిన ‘వార్షిక ఆహార భద్రత, పౌష్టికాహరం’ నివేదిక వెల్లడించింది. 

18 శాతం పెరిగిన ఆకలి కేకలు!

మహమ్మారి పూర్తిస్థాయి ప్రభావాన్ని ఇప్పటికింకా పూర్తిగా అంచనా కట్టకపోయినప్పటికీ, 2019తో పోలిస్తే 2020లో 11.8 కోట్లమంది ఆకలితో అలమటించారనీ, ఇది 18 శాతం ఎక్కువ అని ఆ నివేదిక బట్టబయలు చేసింది. ఈ పెరుగుదల గత ఐదేళ్లకు కలిపి లెక్కించినా ఎక్కువే అని ఆ నివేదిక తెలియజేసింది. 2020లో దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరి(237 కోట్లమంది)కి చాలినంతగా ఆహారం అందుబాటులో లేకపోయిందని, కేవలం ఒక ఏడాదిలోనే ఆకలితో అలమటించేవారి సంఖ్య 32 కోట్లకు పెరిగిందని ఆ నివేదిక పేర్కొంది. 

పదిమందిలో ఒకరికి పౌష్టికాహార లోపం! 

ఆ నివేదిక ప్రకారం.. ప్రతి పదిమందిలో ఒకరు పౌష్టికాహార లోపానికి గురయ్యారు. అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో ఎక్కువ మంది ఆర్థికంగా దిగజారిపోవడంతో ఆకలి కేకలు పెచ్చుపెరిగాయి. దీనికితోడు ప్రకృతి విపత్తులు సంభవించిన దేశాల్లో తీవ్రమైన ప్రభావం పడింది. కొవిడ్‌-19 మహమ్మారి ప్రభావం సముద్రంలో పైకి కనిపించే మంచుపర్వతం అగ్రభాగంలా ఉంది అని నివేదిక చెప్పింది. అయితే కొవిడ్‌ వల్ల తలెత్తిన ఆహార సంక్షోభాన్ని అధిగమించేందుకు ఈ సంవత్సరం అరుదైన అవకాశం కనిపిస్తోందని, ఆహారభద్రత, పోషకాహారంపై జరిగే రెండు శిఖరాగ్ర సదస్సులు, వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగే సీఓపీ26వ సమావేశం మార్గం చూపించవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి విభాగాలు ఎఫ్‌ఏఓ, ఐఎఫ్‌ఏడీ, యూనిసెఫ్‌, డబ్ల్యూహెచ్‌వో తదితర సంస్థలు సంయుక్తంగా ఈ నివేదికను ప్రచురించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని