
corona vaccine: టీకాతో గర్భిణులకు ప్రయోజనం
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ
దిల్లీ: దేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతమవుతోంది. ఈ నేపథ్యంలో గర్భిణులు టీకా పొందొచ్చా లేదా అనే అంశం ప్రారంభం నుంచి చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఇదే అంశంపై స్పష్టతనిచ్చారు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం గర్భిణులకు టీకా ఇవ్వొచ్చు. ఇది వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రపంచంలో పిల్లలకు టీకా ఇస్తున్న దేశంగా మన భారతదేశం నిలిచింది. ప్రస్తుతం 2-18 ఏళ్ల వయస్సున్న పిల్లలపై టీకా ప్రయోగాలు జరుగుతున్నాయి. వాటి ఫలితాలు సెప్టెంబరులో రావాల్సి ఉంది. అతి చిన్న వయస్సు ఉన్న పిల్లలకు టీకా అవసరమా అన్నది ప్రశ్నార్థకమే. పిల్లలపై చేస్తున్న వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు వచ్చాక దానిపై స్పష్టత వస్తుంది. త్వరలోనే గర్భిణులు టీకా పొందేందుకు పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేస్తాం. ప్రస్తుతానికి దేశంలో పాలిచ్చే తల్లులు టీకా తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు’’ అని తెలిపారు. కాగా ఐసీఎంఆర్ తాజా అధ్యయనం ప్రకారం.. కరోనా ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వేవ్‌లోనే మహిళలు వైరస్ బారిన పడి ఎక్కువగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది.