Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు.. సీఆర్డీఏ సంప్రదింపులు షురూ!

రాజధాని అమరావతి (Amaravati) పునర్నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది.

Updated : 23 Jun 2024 13:32 IST

అమరావతి: రాజధాని అమరావతి (Amaravati) పునర్నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. రాజధాని ప్రాంతంలో పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2014-19 మధ్య భూములు కేటాయించిన కేంద్ర సంస్థలతో సీఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూముల విషయంలో ప్రణాళికలు చెప్పాలంటూ అధికారుల నుంచి ఆయా సంస్థలకు ఫోన్లు వెళ్లినట్లు సమాచారం. 

గత ఐదేళ్లలో కాలంలో తమను ఎవరూ సంప్రదించలేదని ఆయా సంస్థల ప్రతినిధులు తెలపగా.. తమకు కేటాయించిన స్థలం చూపించాలని సీఆర్డీఏ అధికారులను కొన్ని సంస్థలు కోరినట్లు తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలో కేటాయించిన స్థలం చూసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని మరికొన్ని సంస్థల ప్రతినిధులు వెల్లడించినట్లు సమాచారం. తెదేపా హయాంలో 10-15 కేంద్ర సంస్థలు, జాతీయ బ్యాంకులకు రాజధానిలో భూములు కేటాయించారు. కాగ్, ఆర్బీఐ, సీబీఐ, ఎఫ్‌సీఐ, సీపీడబ్ల్యూడీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ పోస్ట్స్, నిఫ్ట్, ఎన్ఐడీ, టూల్ డిజైన్ తదితర సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి. నాబార్డ్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎల్ఐసీ, ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, గెయిల్ తదితర సంస్థలు అమరావతిలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని