TTD: భక్త జనసంద్రంగా మారిన తిరుమల... శ్రీవారి దర్శనానికి 20గంటల సమయం

తిరుమల భక్త జనసంద్రంగా మారింది. సర్వదర్శనం టోకెన్ల కోసం నిన్న తొక్కిసలాట జరగడంతో అప్రమత్తమైన తితిదే అధికారులు టోకెన్ల విధానం తీసేసిన

Updated : 13 Apr 2022 20:49 IST

తిరుమల: శ్రీవారి దర్శనానికి తితిదే సర్వదర్శనం టోకెన్‌ లేని భక్తులను కూడా అనుమతిస్తుండడంతో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు సర్వదర్శనం టోకెన్‌లు లేకుండా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి వచ్చిన దాదాపు 15వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్లలో శ్రీవారి సర్వదర్శనం క్యూలైన్‌లలో వచ్చిన భక్తులు వేచి ఉన్నారు. యాత్రికుల సంఖ్య మేరకు ప్రస్తుతం 10 నుంచి 15 గంటల సమయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం తిరుమలలో సర్వదర్శనం క్యూలైన్‌లను లేపాక్షి కూడలి నుంచి తిరుమల లగేజీ కౌంటర్‌ వరకు పొడిగించారు. లేపాక్షి కూడలి నుంచి సర్వదర్శనం క్యూలైన్‌లలోకి భక్తులను అనుమతిస్తున్నారు. క్యూలైన్‌ పక్కన నడిచివెళ్లే భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలను తితిదే అందిస్తోంది. దీంతోపాటు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, పాలు, తాగునీటిని తితిదే అన్నప్రసాద విభాగం ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతానికి సర్వదర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులందరూ వైకుంఠం క్యూకాంప్లెక్స్‌కు చేరుకుని వేచి ఉండి, శ్రీవారిని దర్శించుకోవాల్సిందేనని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. దీంతో భక్తులు 15 నుంచి 20 గంటలు సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా భక్తులు తగిన ఏర్పాట్లు చేసుకుని రావాలని సూచించారు.  తిరుపతిలో ఇకపై సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్‌లు జారీచేయమని అదనపు ఈవో స్పష్టం చేశారు. దీనిపై పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

శ్రీవారిని దర్శించుకున్న 72,567 మంది భక్తులు

శ్రీవారిని మంగళవారం 72,567 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి హుండీ కానుకలు రూ.4.32 కోట్లు లభించింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం, వర్చువల్‌ సేవలు, శ్రీవాణిట్రస్టు టికెట్లు కలిగిన భక్తులకు శ్రీవారి దర్శనం లభిస్తోంది. శ్రీవారికి 40,468 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

* తిరుమలలో నాదనీరాజనం వేదికపై ఎస్వీ వేదవిజ్ఞానపీఠం, వేదిక్‌ వర్సిటీ ఆధ్వర్యంలో ఉదయం బాలకాండ పారాయణం, సాయంత్రం పతంజలి యోగదర్శనం, రాత్రి ఆదిపర్వం పారాయణం పండితులు నిర్వహిస్తున్నారు.

* శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ సర్టిఫికేట్‌ను లేదా 72 గంటల ముందు చేసిన ఆర్టీపీసీఆర్‌ నెగటివ్‌ రిపోర్టును తీసుకుని రావాలి.

* తిరుమలలోని పద్మావతి అతిథిగృహం, సీఆర్వో, ఎంబీసీ, కౌస్తుభంలో భక్తులకు గదులు లభిస్తున్నాయి. గదుల బుకింగ్‌కు భక్తులు కాషన్‌ డిపాజిట్‌ చెల్లించాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని