
Cyclone Jawad: తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం!
ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
విశాఖ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. విశాఖకు ఆగ్నేయంగా 420 కి.మీల దూరంలో.. ఒడిశా గోపాల్‌పూర్‌కు 530 కి.మీల దూరంలో ‘జవాద్’ తుపాను కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. గంటకు 25 కి.మీల వేగంతో తీరం వైపు కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరగనుందని, అలా వచ్చే కొద్దీ దిశ మార్చుకొని పూరీ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తా తీరంలో 80 నుంచి 90 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు హెచ్చరించారు. పలు చోట్ల 20 సెం.మీలకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపారు. తుపాను వల్ల 3.5మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తాంధ్రలో అన్ని పోర్టులకు అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
విశాఖలో కంట్రోల్ రూం ఏర్పాటు..
తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జీవీఎంసీ, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున అధికారులకు సూచించారు. తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. తుపాను సహాయక చర్యల కోసం 66 మంది ఎన్డీఆర్ఎఫ్, 55 ఎస్డీఆర్ఎఫ్ సభ్యులను సిద్ధం చేసినట్లు చెప్పారు. మరోవైపు విశాఖ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 0891-2590100, 0891-2590102, 0891-2750089, 0891-2750090, 0891-2560820 నంబర్లతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని.. సహాయం కోసం ఈ నంబర్లకు ఫోన్ చేయొచ్చని జిల్లా అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం.. 11 మండలాల్లో తీవ్రత ఉండే అవకాశం: సమీక్షలో ధర్మాన కృష్ణదాస్
జవాద్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్లో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సమీక్ష నిర్వహించారు. తుపాను నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 11 మండలాల్లో తుపాను తీవ్రత ఉండే అవకాశముందన్నారు. విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. తాగునీటి కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
విజయనగరం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన
జవాద్ తుపాను నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి పర్యటించారు. మెంటాడ మండలంలోని ఆండ్ర రిజర్వాయర్‌ను పరిశీలించారు. డ్యామ్ భద్రతకు చేపట్టిన చర్యలు, రిజర్వాయర్‌లో ప్రస్తుత నీటి నిల్వలు, డ్యాంలో నీటి పరిమాణాన్ని తగ్గించేందుకు చేపట్టిన చర్యలను జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ సుగుణాకర్ రావు వివరించారు. తుపాను నేపథ్యంలో జిల్లా ప్రజలు, రైతులను అప్రమత్తం చేశామని.. వైద్య బృందాలు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.