Cyclone Mandous: మాండౌస్‌ ప్రభావం : ఏపీలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు

తుపాను ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తుపాను ప్రభావంతో తిరుపతిలో రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది.

Updated : 10 Dec 2022 14:03 IST

చిత్తూరు: పశ్చిమ మధ్య బంగళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తుపాను తమిళనాడులోని మహాబలిపురం వద్ద తీరాన్ని దాటింది. తీరాన్ని దాటిన అనంతరం ఇది తీవ్ర వాయుగుండంగా బలహీన పడినట్టు ఐఎండీ తెలిపింది. క్రమంగా ఇది మరింతగా బలహీన పడి సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రేపు కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తుపాను తీరం దాటినప్పటికీ రేపటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.

తుపాను ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తుపాను ప్రభావంతో తిరుపతిలో రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేవీబీపురం మండలం శ్రీకాళహస్తి-పిచ్చటూరు రహదారిపై వరద ప్రవహిస్తోంది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చెట్లు విరిగి పడ్డాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని స్వర్ణముఖి నదికి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. బాలాయపల్లి మండలం కడగుంట వంతెనపై కైవల్య నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దక్కిలి మండలం లింగాసముద్రం రహదారిపై విరిగిన చెట్లను అధికారులు తొలగిస్తున్నారు. కేవీబీపురం మండలం కాలంగి రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పది గేట్లను 9 అడుగుల మేర ఎత్తి 15వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా కేవీబీపురం మండలం రాజులకండ్రిగ వద్ద కాజ్‌వే కొట్టుకుపోయింది.

తుపాను ప్రభావంపై సీఎం జగన్‌ సమీక్ష..

తుపాను ప్రభావంపై సీఎం జగన్‌ సమీక్షించారు. తుపాను పరిస్థితులపై సీఎంఓ అధికారులతో మాట్లాడారు. అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తుపాను ప్రభావంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు, భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే పునరావాస శిబిరాలను తెరవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని