Hyderabad: బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాలలో మరో అక్రమం.. అనుమతి లేకుండానే తరగతుల నిర్వహణ

చిన్నారిపై లైంగిక దాడి వ్యవహారంలో బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, తాజగా విద్యాశాఖ అధికారుల పరిశీలనలో ఇదే పాఠశాలలో మరో అక్రమం వెలుగు చూసింది. 

Updated : 25 Oct 2022 16:36 IST

హైదరాబాద్: చిన్నారిపై లైంగిక దాడి వ్యవహారంలో బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యా శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కమిటీని ఏర్పాటు చేసి పాఠశాలను కొనసాగించాలని.. గుర్తింపు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు. ఇప్పటికే సఫిల్ గూడ, కేబీఆర్ పార్కు వద్ద రెండుసార్లు ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇవాళ హైదరాబాద్ డీఈఓ కార్యాలయం ఆవరణలో కొంతమంది తల్లిదండ్రులు సమావేశమై సంతకాలు చేశారు. అవన్నీ కలిపి బుధవారం విద్యాశాఖ కమిషనర్‌కు ఇవ్వాలని నిర్ణయించారు.

బంజారాహిల్స్‌లోని డీఏవీ పాఠశాలకు 5వ తరగతి వరకే అనుమతి ఉన్నట్లు విద్యాశాఖ అధికారుల పరిశీలనలో తేలింది. కానీ సఫిల్‌గూడ బ్రాంచి పేరుతో 6, 7 తరగతులను సైతం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సఫిల్‌గూడకు చెందిన విద్యార్థులకు.. బంజారాహిల్స్‌లోని డీఏవీ పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులకు యాజమాన్యం తెలిపింది. పాఠశాల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. దీనివల్ల దాదాపు 650 మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారి ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటు చేసి, కమిటీ పర్యవేక్షణలో పాఠశాలను కొనసాగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. తల్లిదండ్రుల విజ్ఞప్తులపై విద్యాశాఖ అధికారుల చర్చిస్తున్నారు. ఈ అంశంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక నిర్ణయం తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు