ఆ పైలట్‌కు భాగ్యనగరితో అనుబంధం ఎక్కువే!

కోలికోడ్‌ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. టేబుల్‌ టాప్‌ రన్‌వే పై నుంచి విమానం జారి రెండు ముక్కలవ్వడం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. విమానాన్ని సురక్షితంగా దించేందుకు పైలట్‌, కెప్టెన్‌ దీపక్‌ వీ సాథె రెండుసార్లు ....

Published : 09 Aug 2020 05:44 IST

హైదరాబాద్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్న దీపక్‌ సాథె

అత్యుత్తమ ప్రతిభకు స్వార్డ్‌ ఆఫ్ ఆనర్ గుర్తింపు‌ 

ఇంటర్‌నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌: కోలికోడ్‌ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. టేబుల్‌ టాప్‌ రన్‌వే పై నుంచి విమానం జారి రెండు ముక్కలవ్వడం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనలో అనేకమంది ప్రయాణికులు మరణించారు. విమానాన్ని సురక్షితంగా దించేందుకు పైలట్‌, కెప్టెన్‌ దీపక్‌ వీ సాథె రెండుసార్లు ప్రయత్నించినా ప్రమాదం జరగడం దురదృష్టకరమని వైమానిక వర్గాలు అంటున్నాయి. బోయింగ్‌ విమానాలు నడపటంలో ఆయనకు ఎంతో అనుభవం ఉందని తెలిసింది.

వందేభారత్‌ మిషన్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రవాస భారతీయులను దుబాయ్‌ నుంచి తీసుకొస్తున్న ఎయిర్‌ ఇండియా విమానం నడిపిన దీపక్‌ వీ సాథె దేశంలోని అత్యుత్తమ పైలట్లలో ఒకరు కావడం గమనార్హం. ఆయనకు హైదరాబాద్‌ నగరంతో మంచి అనుబంధం ఉంది. దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో ఆయన 1981లో శిక్షణ పొందారు. 127వ పైలట్‌ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ‘స్వార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ అందుకున్నారు. అంతకు ముందు ఆయన నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, ఖడక్‌వస్లాలో 58వ బ్యాచ్‌లో శిక్షణ పొంది స్వర్ణ పతకం సాధించారు.

మొదట వాయుసేనలో..

ఎయిర్‌ఫోర్స్‌లో సాథె టెస్టు పైలట్‌గా పనిచేశారు. 1981లో వాయుసేనలో చేరి 2003లో వీడ్కోలు తీసుకున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 17వ స్క్వాడ్రన్‌, గోల్డెన్‌ యారోస్‌లోనూ ఆయన సేవలు అందించారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రఫేల్‌ యుద్ధవిమానాలు ఇక్కడే వాయుసేనలో చేరడం తెలిసిన సంగతే. వీడ్కోలు తర్వాత ఆయన ఎయిర్‌ ఇండియాలో చేరారు. బోయింగ్‌ 737-800 విమానాలను నడపడంలో సాథెకు ఎంతో అనుభవం ఉందని వైమానిక వర్గాలు అంటున్నాయి. ఆయనకు ఎయిర్‌బస్‌ ఏ-310 నడిపిన అనుభవమూ ఉంది. కోలికోడ్‌ విమానాశ్రయం గురించి ఆయనకు ఎంతో అవగాహన ఉందని తెలిసింది.

యుద్ధవిమానాలతో దోస్తీ..

దీపక్‌ వసంత్‌ సాథె ఎయిర్‌ ఫోర్స్‌లో వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఆయన గోల్డెన్‌ యారోస్‌ స్క్వాడ్రన్లో మిగ్‌-21 పైలట్‌గా  పనిచేశారు. భారత్‌ ఫ్రాన్స్‌ నుంచి  మిరాజ్‌ విమానాలను భారత్‌కు తెచ్చిన సమయంలో సాథె వాటిలో ప్రయాణించాడు. పైలట్లకు శిక్షకుడిగా విధులు నిర్వహించారు. ఆయన కార్గిల్‌ యుద్ధంలో భారత్‌కు చెందిన ఒక మొబైల్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ యూనిట్‌కు నేతృత్వం వహించారు.  వీటితోపాటు హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ కోసం టెస్ట్‌ పైలట్‌గా పనిచేశారు. భారత్‌ సొంతంగా అభివృద్ధి చేస్తున్న ఎయిర్‌ బార్న్‌ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ (అవాక్స్‌)లో ఆయన పాత్ర ఉంది. ఇప్పటికి ఈ ప్రాజెక్టు 90శాతం పూర్తైంది.  వాయుసేన నుంచి బయటకు వచ్చాక ఆయన ఎయిర్‌ ఇండియాలో చేరారు.  

ఆ కుటుంబం దేశానికి అంకితం..

దీపక్‌ సాథె 1961లో ముంబయిలో జన్మించారు. డెహ్రాడూన్‌లోని కాంబ్రియన్‌ హాల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. ఆయన తండ్రి సైన్యంలో పనిచేయడంతో అదే ప్రేరణతో ఆయన భారత వాయుసేనలో చేరారు. ఆయన భార్యా, ఇద్దరు పిల్లలు ముంబయిలోనే ఉంటున్నారు. ఖాళీ సమయంలో స్క్వాష్‌ ఆడటమంటే ఆయనకు ఎంతో ఇష్టమని తెలిసింది. సాథె‌ కుటుంబం దేశానికి అంకితమైంది. ఆయన తండ్రి బ్రిగేడియర్‌ వసంత్‌ సైన్యంలోని ఎడ్యూకేషన్‌ కోర్‌లో పనిచేశారు. దీపిక్‌ సోదరుడు వికాస్‌ సాథె సెకండ్‌ లెఫ్టినెంట్‌గా జమ్ములో సేవలు అందించారు.  1981లో ఆయన  ఓ ప్రమాదంలో చనిపోయారు.  తాజాగా దీపక్‌ కూడా 174 మంది  ప్రయాణికుల ప్రాణాలను కాపాడే క్రమంలో మరణించారు. అంత్యంత వేగంగా మంటలు అంటుకొనే  ఏవియేషన్‌ ఫ్యూయల్‌ మండకుండా చాకుచక్యంగా వ్యవహరించారు. ముంబయిలో నివాసం ఉండే దీపక్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరు ఐఐటీ ముంబయిలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇక సాథె తల్లిదండ్రులు నాగ్‌పూర్‌ నివాసం ఉంటున్నారు.

ఇవీ చదవండి

భయపడినట్లే జరిగింది

క్షేమంగా ల్యాండ్‌ చేసేందుకు రెండుసార్లు ప్రయత్నించిన పైలట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని