Covid Tests.. ఫలితాల వెల్లడిలో ఆలస్యం

కరోనా పరీక్షల ఫలితాల వెల్లడిలో ఆలస్యం అనుమానిత లక్షణాలున్నవారిని కలవరపెడుతోంది. నమూనాలిచ్చి వారం రోజులైనా ఫలితాలు వెలువడకపోవడం ఆందోళన పెంచుతోంది. ఈలోగా పరీక్షలు చేయించుకున్నవారిలో చాలామంది బయట తిరుగుతూ....

Updated : 27 Apr 2021 12:15 IST

బయట తిరుగుతున్న అనుమానితులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా పరీక్షల ఫలితాల వెల్లడిలో ఆలస్యం అనుమానిత లక్షణాలున్నవారిని కలవరపెడుతోంది. నమూనాలిచ్చి వారం రోజులైనా ఫలితాలు వెలువడకపోవడం ఆందోళన పెంచుతోంది. ఈలోగా పరీక్షలు చేయించుకున్నవారిలో చాలామంది బయట తిరుగుతూ వ్యాధి వ్యాప్తికి కారకులవుతున్నారు. ముఖ్యంగా రోజులు వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్న చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

చిత్తూరు జిల్లాలో నమోదయ్యే కేసుల్లో సగానికిపైగా తిరుపతిలోనే వెలుగుచూస్తున్నాయి. ఇక్కడ రోజుకు ఐదు నుంచి ఆరు వేల వరకు నమూనాలు సేకరిస్తుండగా ఫలితాలు వెల్లడిస్తున్న సంఖ్య మూడు వేలలోపే ఉంటోంది. ఈ ఆలస్యంతో నమూనాలు ఇచ్చినవారు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు తిరుపతిలోని జాతీయస్థాయి విద్యాసంస్థ ఐసెర్‌ పరిశోధనాశాలను కొవిడ్‌ పరీక్షల కోసం వినియోగిస్తున్నారు. వీలైనంత త్వరగా కరోనా ఫలితాలను వెల్లడించేందుకు కృషి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

గుంటూరు జిల్లాలోనూ కరోనా నిర్ధరణ పరీక్షలు సహనాన్ని పరీక్షిస్తున్నాయి. జిల్లాలో రోజు వెయ్యికి పైగా కేసులు వెలుగుచూస్తున్నా.. అందుకు తగ్గట్లుగా పరీక్షలు పెంచి ఫలితాలు ఇవ్వడం లేదు. నమూనాల సేకరణ ఎక్కువ కావడంతో రోజూ వేలాది పరీక్షలు పెండింగ్‌లో ఉంటున్నాయి. జిల్లాలో ప్రస్తుతం రోజుకు ఏడు నుంచి తొమ్మిది వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్టీపీసీఆర్‌ విధానంతో ఫలితాల వెల్లడి ఆలస్యమవుతోంది. మొదట్లో కిట్లు, సిబ్బంది కొరత కారణంగా కొంత సమస్య ఎదురైంది. అత్యవసరంగా సిబ్బందిని నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతించడంతో ఆ ప్రక్రియను పూర్తిచేశారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన ఇప్పుడిప్పుడే మెరుగవుతోందని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని