viral video: ఫుడ్‌ డెలివరీ బాయ్‌కి బొట్టు పెట్టి.. అక్షింతలు వేసి..!

ఆకలేస్తోందని ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టినప్పుడు.. అది కాస్తా ఆలస్యమైతే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. తీరా ఫుడ్‌ డెలివరీ బాయ్‌ వచ్చాక అతడిని చెడామడా తిట్టయ్యడమో.. తక్కువ రేటింగ్‌ ఇవ్వడమో చేస్తుంటాం. కానీ, దిల్లీలో ఈ పెద్దాయన చేసింది వైరల్‌గా మారింది.

Published : 09 Oct 2022 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆకలేస్తోందని ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టినప్పుడు.. అది కాస్తా ఆలస్యమైతే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. తీరా ఫుడ్‌ డెలివరీ బాయ్‌ వచ్చాక అతడిని చెడామడా తిట్టయ్యడమో.. తక్కువ రేటింగ్‌ ఇవ్వడమో చేస్తుంటాం. మరీ కోపమొస్తే ఆర్డర్‌ను వెనక్కి తిప్పి పంపిస్తాం. కానీ, దిల్లీకి చెందిన ఈ పెద్దాయన మాత్రం అలా కాదు. గంట ఆలస్యంగా వచ్చిన డెలివరీ బాయ్‌కి బొట్టు పెట్టి అక్షింతలు వేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

దిల్లీకి చెందిన సంజీవ్‌ త్యాగి జొమాటోలో ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టారు. ఓ గంట ఆలస్యంగా జొమాటో డెలివరీ బాయ్‌ ఆయన ఇంటికి చేరుకున్నారు. అప్పటికే చాలా సేపటి నుంచి ఫుడ్‌ కోసం ఎదురుచూస్తున్న త్యాగికి ఫుడ్‌ డెలివరీ బాయ్‌ ఎదురుపడ్డాడు. ఇవాళ తిట్ల వర్షమే అనుకున్న ఆ డెలివరీ బాయ్‌కి త్యాగి నుంచి వింత అనుభవం ఎదురైంది. 90ల్లో బాలీవుడ్‌లో వచ్చిన విజయపథ్‌ చిత్రంలోని ‘ఆయియే ఆప్‌కా ఇంతిజార్‌..’ అంటూ సాగే సాంగ్‌ను ప్లే చేస్తూ డెలివరీ బాయ్‌కి నవ్వుతూ ఎదురెళ్లారు. నుదుటికి బొట్టు పెట్టి, నెత్తిమీద అక్షింతలు వేసి పార్శిల్‌ను అందుకున్నారు.

ఈ వీడియో త్యాగి తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ‘దసరా రోజున దిల్లీలో ట్రాఫిక్‌  విపరీతంగా ఉన్నా ఆర్డర్‌ అందుకున్నా.. థాంక్యూ జొమాటో’ అని పేర్కొన్నారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షల్లో వీక్షించారు. ఆలస్యం అయినందుకు తిట్టకుండా ఇలా వినూత్నంగా వ్యవహరించడం బాగుందని పలువురు కొనియాడారు. జొమాటో బాయ్‌ సైతం బొట్టు పెట్టించేందుకు హెల్మెట్‌ తీసి నవ్వుతూ స్పోర్టివ్‌గా వ్యవహరించారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు