Delusion Disorder: అనుమానం పెనుభూతం.. పరిష్కారాలేంటో తెలుసా..?

అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు. ఒకసారి అది మనసులోకి ఎక్కితే పాత రోగంలా మారుతుంది. 

Published : 06 May 2022 02:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు. ఒకసారి అది మనసులోకి ఎక్కితే పాత రోగంలా మారుతుంది. ఈ వ్యాధిఉన్న వారు సంతోషంగా ఉండరు. ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. వైద్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అనుమానం ఒక జబ్బేనని తేల్పి చెప్పింది. ఆధునిక కాలంలో మారిన జీవన సరళిలో ప్రతి ఒక్కరిలోనూ ఈ అనుమానం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి వంద మందిలో ఒక్కరు ఈ రోగ బాధితులేనని ఓ అంచనా! ఈ అనుమానపు రోగాన్ని సకాలంలో గుర్తించి వైద్య చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి ఉచ్చు నుంచి తొందరగానే బయటపడవచ్చు. వైద్య పరిభాషలో డెల్యూషన్‌ డిసార్డర్‌ అని పిలిచే అనుమానపు జబ్బు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అనుమానం అనేది మెదడు చేసే మాయాజాలం. ఈ వ్యాధితో బాధపడేవారు వారు అనుకున్నదే నిజమని నమ్ముతారు. ఎదుటివారు అది నిజం కాదని వారించినా వాళ్లు అనుకున్నదే వాస్తవమని విశ్వసిస్తారు. తనను ఎవరో వెంటాడుతున్నట్లు, తనకు వ్యతిరేకంగా ఎవరో కుట్ర పన్నుతున్నట్లు, తనను చంపడానికి ఎవరో ప్రయత్నిస్తున్నట్లు, తన జీవిత భాగస్వామి ఎవరితోనో ప్రేమలో ఉందని, అక్రమ సంబంధం ఉన్నట్లు భావిస్తారు. మరికొందరు అయితే వారు ఈ లోకంలో అందరికంటే ఉన్నతమైన ప్రత్యేకమైన వ్యక్తిలా అనుకుంటారు. ఇంకొందరు వారికి వారే తక్కువ చేసుకొని వారు ఎందుకు పనికిరామని అనుకుంటూ ఉంటారు. కొందరేమో తమకు విపరీత శక్తులు ఉన్నాయని అనుకుంటారు. మరికొందరు వారికి ఏదో జబ్బు ఉందని వైద్యుని అవసరం ఉందని అనుకుంటూ ఉంటారు. వారి మనసులోకి వచ్చిన దానినే నిజమని అభిప్రాయపడతారు. దాన్నే బలంగా నమ్ముతారు. ఈ అనుమానాలతోనే జీవితాన్ని కూడా అలాగే గడుపుతుంటారు. వారి ఆలోచనలను కుటుంబ సభ్యుల మీద చూపించి వారు ఇబ్బందులు పడే పనులు చేస్తుంటారు.

 లక్షణాలు:

తరచూ కోపం వస్తుంటుంది. ఆందోళనగా ఉంటారు. ఒంటరిగా ఉంటారు. ప్రతి చిన్నదానికి భయపడతారు. ఎవరో పిలిచినట్లు అనుకుంటారు. వాళ్లకు ఏదో దృశ్యాలు కనిపిస్తున్నట్లుగా, ఏవో చప్పుళ్లు వినిపించినట్లుగా ఉంటుంది. తీవ్రంగా ఆలోచనలు ఉన్నవారికి ఈ అనుమానం ఎక్కువగా ఉంటుంది. 

కారణాలు: 

* వంశపారంపర్యము
* వాతావరణం
* మనుష్యుల మీద నమ్మకం పోవడం

* ఒంటరితనం, నిరాశ

* ఏది కోరుకున్నా దక్కకపోవడం

* పెరిగిన పరిస్థితులు
* స్నేహితులు, బంధువుల వల్ల మోసపోవడం

పరిష్కారాలు ఏంటి? 

* వైద్యుల వద్దకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. 

* ఈ వ్యాధితో బాధపడుతున్నవారి దారిలోకి వెళ్లి వాళ్లకు నచ్చజెప్పాలి. అలాకాకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేదో అయింది అని మాట్లాడకూడదు. అలా మాట్లాడితే వారు మరింత నిరాశకు గురవ్వడమో లేదా కోపానికి గురికావడమో జరుగుతుంది.  

* సైక్రియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకురావాలి. మందులు వాడాలి.

* మందుల వల్ల తగ్గకుంటే సైకోథెరపీ, బిహేవియర్‌ థెరపీ, ఫ్యామిలీ థెరపీ చేయించాలి. 

* వారి చుట్టూ సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోవాలి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని