Tauktae: ఏపీ, తెలంగాణలకు వర్ష సూచన

లక్షద్వీప్‌ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ‘తౌక్టే’ తుపానుగా రూపాంతరం చెందింది. గోవాకు దక్షిణ నైరుతి దిశగా 330 కి.మీ. దూరంలో 

Published : 15 May 2021 17:54 IST

హైదరాబాద్‌: లక్షద్వీప్‌ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ‘తౌక్టే’ తుపానుగా రూపాంతరం చెందింది. గోవాకు దక్షిణ నైరుతి దిశగా 330 కి.మీ. దూరంలో ‘తౌక్టే’ కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది రాగల 6 గంటల్లో తీవ్ర, 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుంది. ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి మరింత బలపడే అవకాశం ఉంది. మే 18న 2.30 నుంచి 8.30 గంటల మధ్య గుజరాత్‌ వద్ద ‘తౌక్టే’ తీరం దాటవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

తౌక్టే తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపుల కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.  ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమలలో ఈదురు గాలులు, తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. శుక్రవారం విదర్భ, పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు బలహీన పడింది. దీనివల్ల తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి  మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను ప్రభావం తెలంగాణపై ఈ రోజు, రేపూ ఉండనుంది. శనివారం దక్షిణ, నైరుతి  జిల్లాలపై , ఆదివారం పశ్చిమ జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు వివరించారు.

రోజు ముందే... కేరళకు రుతుపవనాలు!

ఈ ఏడాది ఒకరోజు ముందుగా... ఈనెల 31నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. రుతుపవనాలు మొట్టమొదట ఈనెల 22న దక్షిణ అండమాన్‌ సముద్ర ప్రాంతానికి చేరనున్నాయి. అనంతరం వాయవ్య దిశగా ముందుకు కదులుతాయని ఐఎండీ పేర్కొంది. దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదవుతుందని అంచనా వేసింది. అయితే- ఒడిశా, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మేఘాలయ, అస్సాంలో అంతకంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని