Pollution: లాక్‌డౌన్‌లోనూ పెరిగిన వాయు కాలుష్యం..!

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం కలవరపాటుకు గురిచేస్తోంది. తాజాగా దేశంలోని అధిక జనాభా ఉన్న 8 ప్రధాన నగరాల్లో వాతావరణ కాలుష్యంపై

Updated : 22 Aug 2022 16:54 IST

దిల్లీ: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం కలవరపాటుకు గురిచేస్తోంది. తాజాగా దేశంలోని అధిక జనాభా ఉన్న 8 ప్రధాన నగరాల్లో వాతావరణ కాలుష్యంపై గ్రీన్ పీస్‌ ఇండియా అధ్యయనం చేసింది. గతేడాది ఏప్రిల్‌లో ఉన్న వాతావరణ పరిస్థితులతో ఈ ఏడాది అదే నెలలోని పరిస్థితులను పోల్చి ఈ అధ్యయనం చేపట్టింది. దీని ప్రకారం దిల్లీ వాతావరణంలో నైట్రోజన్‌  125 శాతం పెరిగినట్టు తెలిపింది. చెన్నైలో 94 శాతం, బెంగళూరులో 90 శాతం, హైదరాబాద్‌లో 69 శాతం, ముంబయిలో 52 శాతం, జైపుర్‌లో 47 శాతం, లఖ్‌నవూలో 32 శాతం, కోల్‌కతాలో 11 శాతం వాయు కాలుష్యం పెరిగినట్లు తేల్చింది. శిలాజ ఇంధనాలు మండించడం ద్వారా ఉత్పన్నమయ్యే కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం చేపట్టిన గ్రీన్ పీస్‌ ఇండియా వెల్లడించింది. ఈ 8 ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతోందని వివరించింది. ఈ నగరాల్లోని వాతావరణంలో నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌ స్థాయులు పెరగడానికి శిలాజ ఇంధనాలపై ఆధారపడి నడిచే మోటారు వాహనాలు, పరిశ్రమలే ప్రధాన కారణంగా పేర్కొంది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాది ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌లో రవాణా, పరిశ్రమలు చాలావరకు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కాలుష్యం తగ్గాల్సిఉండగా.. మునుపెన్నడూ లేని విధంగా పెరగడం ఆందోళన కలిగించే అంశం. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా.. ప్రజలను ఎక్కువగా ప్రయివేటు వాహనాల వినియోగం నుంచి ప్రజారవాణా వైపు మళ్ళించేందుకు ప్రభుత్వం సహా ఆయా నగరాల పురపాలికలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గ్రీన్ పీస్‌ ఇండియా అభిప్రాయపడింది.   

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని