TTD: సర్వదర్శనం భక్తులకు తితిదే అధిక ప్రాధాన్యత.. 10గంటల్లో దర్శనం

శ్రీవారి దర్శనానికి తితిదే సర్వదర్శనం టోకెన్‌ లేని భక్తులను అనుమతిస్తుండడంతో పెద్దయెత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వారాంతంలో తిరుమలలో భక్తుల

Updated : 14 Apr 2022 19:21 IST

తిరుమల: శ్రీవారి దర్శనానికి తితిదే సర్వదర్శనం టోకెన్‌ లేని భక్తులను అనుమతిస్తుండడంతో పెద్దయెత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వారాంతంలో తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం తిరుమలలో భక్తులు ఆళ్వార్‌ట్యాంక్‌ వరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉన్నారు. యాత్రికుల సంఖ్యమేరకు 10 గంటల్లో శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది. క్యూలైన్‌ పక్కన నడిచివెళ్లే భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలను తితిదే అందిస్తోంది. దీంతోపాటు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, పాలు, తాగునీటిని తితిదే అన్నప్రసాద విభాగం ద్వారా సరఫరా చేస్తున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న 88,748 మంది భక్తులు

శ్రీవారిని సర్వదర్శనం క్యూలైన్‌లలో దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు తితిదే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. బుధవారం శ్రీవారిని అత్యధికంగా 88,748 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో సర్వదర్శనం క్యూలైన్‌ల ద్వారా 46,400 మంది, రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం ద్వారా 25,819 మంది, వర్చువల్‌ సేవలు, సేవాటికెట్లు, టూరిజం టికెట్లు కలిగిన 16,529 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి హుండీ కానుకల ద్వారా రూ.4.82 కోట్ల ఆదాయం లభించింది. 38,558 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ను తనిఖీచేసిన తితిదే అదనపు ఈవో

శ్రీవారి సర్వదర్శనం క్యూలైన్‌లను తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తనిఖీ చేశారు. సర్వదర్శనం భక్తులకు 3 గంటల్లోనే దర్శన భాగ్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఉదయం నుంచి నిరంతరాయంగా సర్వదర్శన భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నామని తెలిపారు. తిరుమలలో నాదనీరాజనం వేదికపై ఎస్వీ వేదవిజ్ఞానపీఠం, వేదిక్‌ వర్సిటీ ఆధ్వర్యంలో ఉదయం బాలకాండ పారాయణం, సాయంత్రం పతంజలి యోగదర్శనం, రాత్రి ఆదిపర్వం పారాయణం పండితులు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని