AP News: తిరుమల శ్రీవారి మహాద్వారం వద్ద భక్తుల నిరసన

తిరుమ‌ల శ్రీవారి ఆల‌యం వ‌ద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాము  మ‌ధ్యాహ్నం నుంచి క్యూలైన్లో ఉన్నా ప‌ట్టించుకోలేదంటూ.....

Updated : 13 Jan 2022 22:38 IST

తిరుమల: తిరుమ‌ల శ్రీవారి ఆల‌యం వ‌ద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన సామాన్య భక్తులు శ్రీవారి ఆలయంలో ఆందోళనకు దిగారు. క్యూలైన్లలో తాము గంటల తరబడి వేచి ఉన్నామని సర్వదర్శనం భక్తులు అసహనం వ్యక్తంచేశారు. మధ్యాహ్నం 2గంటల నుంచి కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులను సాయంత్రం 6గంటలకు కూడా దర్శనానికి అనుమతించకపోవడం, మంచినీరు, అల్పాహారం, పాలు అందుబాటులో లేకపోవడంతో భక్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వృద్ధులు, చిన్న పిల్లలు, షుగర్‌ వ్యాధితో బాధపడే వారు ఆకలితో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ధనుర్మాస పూజలు, వైకుంఠ ఏకాదశి  కైంకర్యాలు పూర్తయిన తర్వాత 1.15 గంటల నుంచి ఉదయం 7.30 గంటల వరకు అత్యంత ప్రముఖులు, ప్రముఖులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. ఉదయం 8గంటల నుంచి సామాన్య భక్తులకు అవకాశం కల్పించారు. వైకుంఠ ద్వార దర్శనం రోజు ఏటా లక్షమంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. కానీ, ఈ ఏడాది ఏకాదశి తొలి రోజు 45వేల మందికి టికెట్లు జారీ చేశారు. అయినా, భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. సిఫారసు లేఖలు ఉన్నవారిని సుపథం నుంచి అనుమతిస్తూ రూ.300ల టికెట్‌ కొనుగోలు చేసిన వారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు కంపార్ట్‌మెంట్లలోనే కూర్చోబెట్టడం భక్తుల ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో స్వామి దర్శనం కోసం మహాదారం వద్దకు చేరుకున్న భక్తులకు ఒక్కసారిగా తితిదే ఈవో, అదనపు ఈవో వైఖరికి నిరసనగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల భక్తులు తమ బాధను మీడియా ఎదుట  చెప్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మీడియాతో మాట్లాడనీయకుండా భక్తులను  పోలీసులు లాక్కెళ్లారు.  భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ప్రకటించిన అధికారులు... చివరికి భక్తుల నుంచి నిరసన ఎదుర్కోక తప్పలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని