Andhra News: శ్రీవారి సర్వదర్శనం టోకెన్లకు ఎగబడిన భక్తులు.. తిరుపతిలో తోపులాట

తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు భారీగా ఎగబడటంతో తోపులాట చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా టోకెన్ల పంపిణీ

Updated : 12 Apr 2022 11:28 IST

ముగ్గురికి గాయాలు.. రుయాకు తరలింపు

తితిదే: తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు భారీగా ఎగబడటంతో తోపులాట చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా టోకెన్ల పంపిణీ నిలిపివేయడంతో భక్తులు తిరుపతిలో వేచి ఉన్నారు. ఈరోజు మళ్లీ సర్వదర్శనం టోకెన్ల కౌంటర్లు తెరవడంతో భక్తులు భారీగా ఎగబడ్డారు. చిన్నపిల్లలతో క్యూలైన్లలో అవస్థలు పడ్డారు.

రెండు రోజుల విరామం అనంతరం తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌ వద్ద టోకెన్లు పంపిణీ చేశారు. గోవిందరాజస్వామి సత్రం వద్దకు వేచి ఉన్న భక్తులతో పాటు నేడు వచ్చిన భక్తులు భారీగా తరలి రావడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో ముగ్గురు భక్తులు గాయపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తితిదే విజిలెన్స్‌, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా భక్తులను నిలువరించలేకపోయారు. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.

బ్లాక్‌లో టికెట్లు అధిక ధరకు అమ్ముకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. టోకెన్ల పంపిణీకి సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

టోకెన్లు లేకున్నా తిరుమలకు: తితిదే

తిరుపతిలో  శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తుల రద్దీ నెలకొనడంతో తితిదే చర్యలకు ఉపక్రమించింది. తిరుపతిలోని మూడు కౌంటర్ల వద్దకు భక్తులు భారీగా తరలివచ్చారని.. ఇవాళ ఒక్కరోజు దర్శన టోకెన్లు లేకున్నా తిరుమలకు పంపిస్తున్నట్లు తితిదే ప్రకటించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని