Reporter Murder: సమగ్ర దర్యాప్తునకు ఏపీడీజీపీఆదేశం

కర్నూలు జిల్లా నంద్యాలలో యూట్యూబ్‌ ఛానల్‌ విలేకరి కేశవ హత్యపై సమగ్ర దర్యాప్తు జరపాలని

Updated : 29 Jan 2022 14:44 IST

అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాలలో యూట్యూబ్‌ ఛానల్‌ విలేకరి కేశవ హత్యపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశించారు. హత్యకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్ట్‌ చేయాలని జిల్లా ఎస్పీకి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో సస్పెండ్‌ అయిన కానిస్టేబుల్‌తో పాటు హత్యతో ప్రమేయం ఉన్న అందరిపైనా చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు.

హత్య ఎలా జరిగిందంటే..

పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల పట్టణంలో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ విలేకరిగా పనిచేస్తున్న కేశవ, అతని సహ ఉద్యోగి ప్రతాప్‌తో కలిసి ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌, అతడి సోదరుడు తమను ఆపారని విలేకరి మిత్రుడు ప్రతాప్‌ తెలిపారు. మాట్లాడాలని పిలవడంతో బైక్‌పై ఉన్న కేశవ పక్కకు వెళ్లారన్నారు. ఇంతలో ఒక్కసారిగా కానిస్టేబుల్‌ తమ్ముడు స్క్రూ డ్రైవర్‌తో కేశవ శరీరంపై ఎనిమిది సార్లు పొడిచారు. తీవ్ర గాయాలైన కేశవను అతని మిత్రుడు ప్రతాప్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మట్కా వ్యవహారంలో సామాజిక మాధ్యమాల్లో ఇటీవల ఓ వీడియో వైరల్‌ కావడంతో సస్పెన్షన్‌కు గురైన కానిస్టేబుల్‌ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని