Andhra News: ‘‘ఉద్యోగులకు పోలీసులు సహకరించారా..?’’ డీజీపీని ప్రశ్నించిన ఏపీ సీఎం జగన్!

ఏపీ సీఎం జగన్‌తో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ భేటీ అయ్యారు. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ ఉద్యోగులు నిర్వహించిన

Updated : 04 Feb 2022 15:28 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ భేటీ అయ్యారు. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ ఉద్యోగులు నిర్వహించిన ‘చలో విజయవాడ’ విజయవంతమైన నేపథ్యంలో సీఎంతో డీజీపీ సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన డీజీపీ.. సీఎంను ప్రత్యేకంగా కలిశారు. సుమారు అరగంట పాటు జరిగిన భేటీలో నిన్న విజయవాడలో ఉద్యోగులు నిర్వహించిన సభ పైనే చర్చ జరిగినట్లు తెలిసింది. పోలీసు నిర్బంధాలు, ఆంక్షలు పెట్టినా ఉద్యోగుల పోరాటం విజయవంతం కావడంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు పోలీసులు సహకరించారన్న విషయంపై డీజీపీని జగన్‌ ప్రశ్నించినట్లు సమాచారం. ఉద్యోగుల రాకను అంచనా వేయడంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైనట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వాటి పనితీరుపైనా చర్చించినట్లు తెలిసింది.

ఉద్యోగులు మారువేషాల్లో రావడం, ముందే విజయవాడ చేరుకుని బస చేయడం లాంటివి జరిగాయని డీజీపీ తెలిపినట్లు సమాచారం. భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలనే విషయంపై డీజీపీకి సీఎం సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సభపై నిన్న కూడా పార్టీ ముఖ్యనేతలతో సీఎం సమావేశమై చర్చించినా ఆ భేటీలో డీజీపీ లేరు. పరిస్ధితి తీవ్రత దృష్ట్యా సీఎంను డీజీపీ ఈరోజు కలిసినట్లు సమాచారం. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు భారీ ఎత్తున ‘చలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఇప్పటికే పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు