Diabetes: తీపి జబ్బు: ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఆహారంలో చేయాల్సిన మార్పులు ఏంటి..?

బాగా ఇష్టమైన తీయటి పదార్థాలను తినలేం..కొన్ని రకాల పండ్లను ముట్టుకోవడానికి కూడా సాహసించలేం..కారణం తీయటి జబ్బు మధుమేహం శరీరంలో పెరిగి పోవడమే. కిడ్నీ, గుండె, కాలేయం లాంటి అవయవాలకే కాదు..ఇతర సమస్యలను తెచ్చే మధుమేహం నియంత్రణలో లేకపోతే ఎదురయ్యే సమస్యలు అన్నీఇన్నీ కాదు.

Updated : 10 Aug 2022 11:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాగా ఇష్టమైన తీయటి పదార్థాలను తినలేం.. కొన్ని రకాల పండ్లను ముట్టుకోవడానికి కూడా సాహసించలేం.. కారణం తీయటి జబ్బు మధుమేహం శరీరంలో పెరిగి పోవడమే. కిడ్నీ, గుండె, కాలేయం లాంటి అవయవాలకే కాదు.. ఇతర సమస్యలను తెచ్చే మధుమేహం నియంత్రణలో లేకపోతే ఎదురయ్యే సమస్యలు అన్నీఇన్నీ కావు. కాళ్లు తిమ్మిర్లు రావడం, ఒళ్లంతా దురదగా ఉండటం, కాళ్ల వాపు లాంటి ఇబ్బందులను ఇది పరిచయం చేస్తుంది. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఒళ్లు గుళ్ల చేస్తుంది. మధుమేహం వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఆహారంలో చేయాల్సిన మార్పులు ఏంటీ..? ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలను 
సీనియర్‌ డయాబెటాలజిస్టు డాక్టర్‌ పి.వీ రావు సూచించారు.

ఇతర సమస్యలతోనే చికాకు..

మధుమేహాన్ని అతి మూత్ర వ్యాధి అని కూడా అంటారు. దాహం ఎక్కువగా వేస్తుంది. ఆకలి బాగా ఉంటుంది. మూత్రం ఎక్కువసార్లు పోవాల్సి వస్తుంది. ఇవే కాకుండా ఇటీవల మరికొన్ని కారణాలు కూడా మధుమేహం ఉన్నట్టు చెప్పడానికి దోహదపడుతున్నాయి. వ్యాధి అదుపులో ఉన్నా.. మూత్రం తరచుగా వచ్చే అవకాశం ఉంది. వీరికి మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు కూడా తొందరగా సోకుతాయి. కాళ్లలో తిమ్మిర్లు, దద్దుర్లు కూడా వస్తాయి. అక్కడ గాలి తగిలినా మంటగా అనిపిస్తుంది. నడుస్తుంటే గాజులు గుచ్చుకున్నట్లు అనిపిస్తుంది. కాళ్ల వేళ్ల మధ్య తేమ లేకుండా చూసుకోవాలి. లేకపోతే ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంది. తరచుగా మలబద్దకం, విరేచనాలు అవుతాయి.

మందులతో సరి..

మధుమేహం నియంత్రణలో ఉన్నా, లేకున్నా కొన్ని రకాల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. వీటికి మందులు అందుబాటులో ఉన్నాయి. కొందరికి ఇన్సులిన్‌ కొద్దిమొత్తంలో తీసుకుంటే సరిపోతుంది. రక్తంలో గ్లూకోజ్‌ నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. జననేంద్రియాల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్లను అశ్రద్ధ చేయొద్దు. సకాలంలో వైద్యుల వద్దకు వెళితే ఇబ్బందులు తొలగిపోతాయి.

ఇలా చేసి చూడండి

* ఫైబర్‌ ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఆకు, కాయకూరలు తినాలి.

* వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

* వ్యక్తిగత పరిశుభ్రతను మరవొద్దు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఇన్‌ఫెక్షన్ల బెడద ఉంటుంది.

* ఆల్కహాల్‌, పొగాకుకు దూరంగా ఉండాలి. తీపి పదార్థాల జోలికి వెళ్లకుండా చూసుకోవాలి.

* చురుకైన జీవనశైలిని అలవర్చుకోవాలి. సంగీతం వినడం, పుస్తకాలు చదవడం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని