Health: తీపి జబ్బు..ముకుతాడు వేయకపోతే ముప్పు

జీవిత కాల జబ్బు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం తప్పా శాశ్వతంగా తగ్గించుకునే చికిత్స లేదు..రక్తంలో గ్లూకోజ్‌ శాతం అదుపు తప్పడంతోనే ఈ ప్రమాదం వస్తుంది.

Published : 21 Apr 2022 01:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జీవిత కాల జబ్బు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం తప్ప శాశ్వతంగా తగ్గించుకునే చికిత్స లేదు. రక్తంలో గ్లూకోజ్‌ శాతం అదుపు తప్పడంతోనే ఈ ప్రమాదం వస్తుంది.  కళ్ల నుంచి కాళ్ల దాకా ప్రతి అవయవాన్ని దెబ్బతీసే ప్రమాదకారి ఇది. ఆహారం, అలవాట్లు, జీవనశైలిలో జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం తీరుతెన్నులు, తీసుకోవాల్సిన  జాగ్రత్తలను ఎండోక్రైనాలజిస్టు శ్రీనివాస్‌ కందుల వివరించారు.

అవగాహన కీలకం: మధుమేహం ఉన్న వారిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. మధుమేహం టైప్‌-1, టైప్‌-2 రకాలు. ఎక్కువ మందికి టైప్‌-2 మధుమేహం వస్తుంది. టైప్‌-1 వంశపారంపర్యంగా వస్తుంది. టైప్‌-2 వారి జీవనశైలిలో మార్పులు, వ్యాయామం లేకపోవడం, బరువు అధికంగా ఉండటంతో జబ్బు వస్తుంది. వీరికి ముందుగా మందులతో నియంత్రించినా క్రమేపి ఇన్సులిన్‌ ఇవ్వాల్సి వస్తుంది.

లక్షణాలు ఇవీ: ఎక్కువ షుగర్‌ ఉండటంతో తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం, ఎక్కువ దాహం వేయడం, అత్యధికంగా బరువు తగ్గిపోవడం, అరికాళ్లలో మంట ఉండటం, చూపు మందగించడం లాంటి సమస్యలు కనిపిస్తాయి. 

ప్రమాదకరం ఎందుకంటే: మధుమేహం ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోవడంతో దాని ప్రభావం అనేక అవయవాలపై పడుతుంది. రెటినోపతిలో చూపు మందగిస్తుంది. నెప్రోపతిలో కిడ్నీలు దెబ్బతింటాయి. న్యూరోపతిలో నరాలు దెబ్బతినడంతో నడవడం కష్టంగా ఉంటుంది. గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం రావచ్చు. 

పరీక్షలు ఇవీ: పాస్టింగ్‌, పోస్ట్‌లంచ్‌ గ్గూకోజ్‌ పరీక్ష, హెచ్‌బీఏవన్‌సీ, క్రియాటిన్‌, ప్రోటీన్‌, కంటి పరీక్షలు ఏడాదికోసారైనా చేసుకోవాలి. నీరసం, గుండెలో నొప్పిగా ఉంటే ఈసీజీ, ఎకో పరీక్షలు చేయించాలి.

అదుపులో ఇలా:  మంచి ఆహార శైలి, రోజూ వ్యాయామం చేయడం అవసరం. మందులు తప్పనిసరిగా వేసుకోవాలి. చక్కెర శాతాన్ని తరచుగా పరీక్షించుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని