
మధుమేహమా.. వీటిపై దృష్టి పెట్టండి!
తినే ఆహారమే కాదు.. మానసిక ఒత్తిడి (స్ట్రెస్) కూడా రక్తంలో గ్లూకోజు స్థాయులు పెరిగేలా చేస్తుంది. మధుమేహ చికిత్సలను పాటించటంలో శ్రద్ధను కూడా తగ్గిస్తుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు ఒత్తిడిని తగ్గించుకోటం మీద ఒకింత దృష్టి పెట్టడం మంచిది.
1. స్నేహాలు సుదృఢం
వీలున్నప్పుడల్లా.. వీలు చేసుకొనైనా తరచూ మిత్రులను కలుసుకోవటం మంచిది. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. కుంగుబాటు, ఒంటరితనం దూరమవుతాయి. ఇవి రెండూ గుండెజబ్బుకు కారణమయ్యేవే. మధుమేహం గలవారికి గుండెజబ్బు వచ్చే అవకాశం ఎక్కువని తెలిసిందే.
2. పెంపుడు జంతువుల ఆసరా
పెంపుడు జంతువులు ఒంటరితనం పోగొట్టటానికి తోడ్పడతాయి. కుక్కను పెంచుకున్నట్టయితే దాన్ని బయటకు తీసుకెళ్లే సమయంలో నడవాల్సి ఉంటుంది. ఇది ఒత్తిడి తగ్గటానికే కాదు, రక్తంలో గ్లూకోజు స్థాయులు తగ్గటానికీ తోడ్పడుతుంది. కాబట్టి కుక్క, పిల్లి వంటి వాటిని పెంచుకోవచ్చు.
3. ప్రకృతితో సావాసం
పచ్చటి చెట్ల మధ్య నడిస్తే ఒత్తిడి హార్మోన్ల స్థాయులు, గుండె వేగం, రక్తపోటు తగ్గుతున్నట్టు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రకృతి మధ్యలో గడపటం మానసిక ఉత్సాహాన్నీ కలగజేస్తుంది. ఇవన్నీ ఒత్తిడి తగ్గటానికి తోడ్పడేవే.
4. ధ్యానం తోడు
మనసును కుదురుగా నిలిపే ధ్యానం వంటి పద్ధతులు ఒత్తిడి తగ్గటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎవరికి వారు, ఎప్పుడైనా వీటిని సాధన చేయొచ్చు. ధ్యాన పద్ధతులేవీ తెలియవని బాధ పడాల్సిన పనిలేదు. మనసును శరీరం మీద నిలిపినా మేలే. ఇందుకు మూడు నిమిషాలు కేటాయించినా చాలు.
* కుర్చీ మీద స్థిరంగా కూర్చోండి.
* కళ్లు మూసుకోండి
* కుర్చీ మీద శరీర బరువు పడటం గమనించండి.
* కొద్దిసార్లు గాఢంగా శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతున్న ప్రతిసారీ మరింత ఎక్కువగా విశ్రాంతి పొందుతున్నట్టు ఊహించుకోండి.
* పాదాలు నేలకు తాకుతున్న స్పర్శను గమనించండి.
* వీపు కుర్చీకి ఆనటాన్ని తలచుకోండి.
* కడుపు మీద దృష్టి సారించండి. కడుపు కండరాలు బిగుతుగా ఉన్నట్టు గమనిస్తే వదులు చేయండి.
* ఒకసారి శ్వాస తీసుకోండి.
* నెమ్మదిగా చేతులు, భుజాలు, మెడ, గొంతు, దవడ, ముఖం వదులు చేయండి.
* శరీరం మొత్తం వదులుగా, విశ్రాంతిగా ఉండటాన్ని గమనించండి.
* మరోసారి శ్వాస తీసుకోండి.
* కళ్లను తెరవండి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.