కొత్త సరకులు.. ధరలకు రెక్కలు

ఒకప్పుడు శానిటైజర్‌ అంటే ఏ కొద్ది మందో వినియోగించేవారు. దాని పేరు కూడా చాలా మందికి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఆ పేరు తెలియని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. కరోనా మహమ్మారి తెలియకుండానే మానవ జీవనశైలిని మార్చేస్తోంది.

Published : 08 Aug 2020 19:07 IST

కరోనా ప్రభావంతో పెరిగిన నిత్యావసర వస్తువుల జాబితా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు శానిటైజర్‌ అంటే ఏ కొద్ది మందో వినియోగించేవారు. దాని పేరు కూడా చాలా మందికి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఆ పేరు తెలియని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. కరోనా మహమ్మారి తెలియకుండానే మానవ జీవనశైలిని మార్చేస్తోంది. పాత అలవాట్లు పోయి కొత్త పద్ధతులు అలవడుతున్నాయి. వైరస్‌ నియంత్రణ కోసం శానిటైజర్లు, పోషకాహార సరకుల వినియోగం పెరిగింది. బయట తిండి దాదాపుగా మానేసిన జనం ఇంట్లోనే వండుకుని తింటున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం నిత్యావసర వస్తువుల వినియోగం గణనీయంగా పెరిగింది. నెలవారీ సరకుల్లో ఎండు ఫలాలు, శొంఠి, మిరియాలు, తేనె, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌ల వినియోగం పెరిగింది. వీటికి తోడు ధరలు పెరగడంతో నెలవారీ ఖర్చు తడిచి మోపెడవుతోంది.
కరోనా మనిషి జీవితంలో తెలియకుండానే ఎన్నో మార్పులను తెచ్చింది. ఇన్నేళ్లున్న పద్ధతులు, అలవాట్లు అప్రయత్నంగానే మారిపోతున్నాయి. నెలవారీగా ఇంటికి తీసుకువచ్చే నిత్యావసర సరకుల జాబితా క్రమంగా మారిపోతోంది. ఒకప్పుడు సరకుల జాబితాలో సాధారణంగా కనిపించే వస్తువులు ఇప్పుడు ప్రాధాన్య వస్తువులుగా మారిపోయాయి. ఇంటి వద్దే ఉంటుండటంతో విభిన్న రకాల వంటలు వండుకొని తింటుండటంతో  సరకుల వినియోగం పెరిగింది. సామాన్యులు ఒకప్పుడు రూ.3వేల విలువైన సరకులు తీసుకెళ్లేవారు. ఈసారి ఆరోగ్యం, ఆహారం కోసం మరో రూ.1500 అదనంగా ఖర్చు చేస్తున్నారు.
మరోవైపు పెరిగిన నిత్యావసర సరకుల ధరలతో సామాన్యులు బెంబేలెత్తి పోతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని ధరలను నియంత్రించాలని కోరుతున్నారు. కరోనా ఏరంగంపై ప్రతికూల ప్రభావం చూపినా కిరాణ దుకాణాల గిరాకీ తగ్గలేదని నిర్వాహకులు చెబుతున్నారు. గతంలో రాత్రి 10గంటల వరకు ఉంటే అయ్యే గిరాకి ఇప్పుడు సాయంత్రం 6గంటలకు దుకాణం మూసినా అవుతోందని వివరిస్తున్నారు. ఆదాయం ఉన్నా, లేకపోయినా ఆరోగ్యం ముఖ్యం అనుకొని ప్రస్తుతం జనం తినే తిండికి ప్రాధాన్యమిస్తున్నారు. పప్పులు, గుడ్లు, తేనె వంటి వస్తువులను విరివిగా వినియోగిస్తున్నారు. 
కొన్ని రకాల నిత్యావసర సరకులు డిమాండ్‌కు తగ్గట్టుగా రావడం లేదు. తయారీ తక్కువగా ఉండటంతో వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. డ్రైఫ్రూట్స్‌ ధరలు కూడా భారీగా పెరిగాయి. వినియోగం పెరగడంతో ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రభుత్వ ధరల ప్రకారం నాణ్యమైన బియ్యం ధర కిలో రూ.46 ఉంటే ఈ ఏడాది ఆగస్టులో రూ.48 ఉంది. బహిరంగ మార్కెట్లో రూ.50 నుంచి రూ.52 మధ్య అమ్ముతున్నారు. వంటనూనెలతో పాటు కంది, మినప, పెసర పప్పుల ధరలు భారీగా పెరిగాయి. గతేడాదితో పోల్చుకుంటే కూరగాయల ధరలు తగ్గడం ఊరటనిచ్చే అంశం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని