Infants Diet: పసి పిల్లలకు ఏం తినిపించాలో తెలుసా..?

తన ఒళ్లోని పసిబిడ్డ ఆరోగ్యంతో ఎదగాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. తల్లిపాలతో పాటు ఇంకా బిడ్డకు ఏం తినిపించాలోనని తెగ ఆరాటపడుతుంది. తనకు ఏదీ ఇష్టమో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రతి రుచిని ఆస్వాదించేలా చిన్నారిని తీర్చిదిద్దుతుంది.

Updated : 28 Jul 2022 12:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన ఒళ్లోని పసిబిడ్డ ఆరోగ్యంగా ఎదగాలని ప్రతి తల్లీ కోరుకొంటుంది. తల్లిపాలతో పాటు ఇంకా బిడ్డకు ఏం తినిపించాలోనని తెగ ఆరాటపడుతుంది. తనకు ఏదీ ఇష్టమో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రతి రుచిని ఆస్వాదించేలా చిన్నారిని తీర్చిదిద్దుతుంది. చంటి బిడ్డకు ఘనాహారం అందించడానికి పెద్దల సలహాలను తీసుకుంటుంటారు. చిన్నారులకు పెట్టాల్సిన ఆహారం గురించి పోషకాహార నిపుణురాలు డాక్టర్‌ అంజలీదేవి వివరించారు.

అమ్మపాల నుంచి అన్నప్రాసన దాకా..

* చిన్నారులకు ఆరు నెలల దాకా తల్లిపాలే ఆరోగ్యకరం..ఆ తర్వాత ఘనాహారంతో బిడ్డ బలంగా, ఆరోగ్యంగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తారు. పుట్టినపుడు 3 కిలోలుంటే..ఏడాది నిండే సరికి 10 కిలోలుండాలి.

* ప్రతి మూడు గంటలకోసారి పాలు ఇవ్వాలి. రాత్రి 10 గంటల వరకు మాత్రమే పాలు పట్టాలి. ఆ తర్వాత తెల్లారేవరకు పాలు ఇవ్వకుండా ఉండాలి. ఇలా మూడునెలల వరకు సాగాలి.

* మూడు నెలల తర్వాత తల్లిపాలతో పాటు ఘనపదార్థం అలవాటు చేయాలి. ఒక పదార్థాన్ని వారం, పదిరోజుల పాటు ఇవ్వాలి. లేకపోతే ఆహారం జీర్ణం కాదు. 

* అన్నం, అరటిపండు గుజ్జు, బంగాళదుంప, నెయ్యి కలిపి తినిపించాలి. పప్పుధాన్యాలు, గింజధాన్యాలు, పాలు కలిపి ఇవ్వడం మంచిది. తల్లిపాలకు అలవాటు పడితే ఆహారం తినరు. బాగా సన్నపడిపోతారు.

* పెసళ్లను 15 గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత బట్టలో ఉంచితే మొలకలు వస్తాయి. వీటిని ఎండబెట్టి పొట్టు, మొలకలు తొలగించిన తర్వాత దోరగా వేయించి పిండి పట్టించాలి. రాగులను కూడా ఇలాగే చేసి పిల్లలకు తినిపించాలి.

* ఏడాదిలోపు ఆహారం సరిగా ఇవ్వకపోతే శరీర అవయవాలు పెరగవు. ఈ లోటును ఎప్పటికీ పూడ్చలేం. తల్లి శుభ్రంగా ఉండి పిల్లలకు పరి శుభ్రమైన ఆహారం పెట్టకపోతే అనారోగ్య సమస్యలు, జీర్ణకోశ ఇబ్బందులు, వాంతులు, విరేచనాలు అవుతాయి.

* ఏడాది వచ్చే సరికి పిల్లలకు అన్నిరకాల ఆహార పదార్థాలు, పండ్లు అలవాటు చేయాలి. అప్పుడే రోగనిరోధకత పెరిగి బలంగా తయారవుతారు. ఎదుగుదల బాగుంటుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని