Guinness World Record: ఆయన కాళ్లు కాదు.. చేతులే గిన్నిస్‌ రికార్డును బద్దలు కొట్టాయి!

జియాన్‌ క్లార్క్‌ (23) అనే దివ్యాంగుడు చేతులతోనే వేగంగా పరిగెత్తి గిన్నిస్‌ రికార్డును సృష్టించారు

Published : 25 Sep 2021 01:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరుగుల వీరుడు ఉసేన్‌ బోల్ట్‌ పరుగు పందెంలో రికార్డు బద్దలు కొట్టడం తెలుసు. కానీ, ఓ దివ్యాంగుడు చేతులపై వేగంగా పరుగెత్తి ఓ రికార్డును నెలకొల్పితే..! చేతులతో పరుగెత్తడం ఏంటని ఆలోచిస్తున్నారా? అవును.. జియాన్‌ క్లార్క్‌ (23) అనే దివ్యాంగుడు చేతులతోనే వేగంగా పరిగెత్తి గిన్నిస్‌ రికార్డును సృష్టించారు. అమెరికాకు చెందిన దివ్యాంగుడు జియాన్‌ క్లార్క్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లో తాజాగా చోటు దక్కించుకున్నారు. చేతులపై 20 మీటర్ల దూరాన్ని కేవలం 4.78 సెకన్లలో చేరుకుని ఆయన ఈ ఘనత సాధించారు. అయితే, క్లార్క్‌ ఫిబ్రవరిలోనే ఈ రికార్డును సృష్టించగా.. గ్లోబల్‌ ఆర్గనైజేషన్‌ వారు తాజాగా గుర్తించి గిన్నిస్‌ రికార్డుల్లోకి చేర్చారు.

జియాన్‌ క్లార్క్‌ కాళ్లు లేకుండానే జన్మించారు. దీనికి కాడల్ రిగ్రెషన్ సిండ్రోమ్‌ కారణమని అమెరికా నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ మెడిసిన్ తెలిపింది. దివ్యాంగుడిగా క్లార్క్‌ ఎప్పుడూ బాధపడలేదు. తన స్కూల్‌ డేస్‌లోనే రెజ్లర్‌గా రాణించారు. అంతేకాకుండా ఆయన ఇతరుల్లో స్ఫూర్తి నింపే ఒక వక్తగా, రచయితగా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా.. క్లార్క్‌ చిన్నతనం నుంచి ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటూ పెరిగారు. కానీ, ఆయన దేనికి వంకలు పెట్టకూడదనే నినాదంతో ముందుకు సాగారు. క్లార్క్‌ ప్రస్తుతం 2024లో జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌పై దృష్టి సారించారు. ఆయన రెజ్లింగ్‌, వీల్‌ చేర్‌ రేసింగ్‌ (పారాలింపిక్స్‌)లో పోటీ చేసి అమెరికన్‌ అథ్లెట్‌గా ఎదగాలనుకుంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని